అమరావతి:టిడ్కో ద్వారా రూ. 3 వేల కోట్లు, రూరల్ హౌసింగ్ స్కీమ్ ద్వారా రూ. 1300 కోట్లు అప్పులు పెట్టి  చంద్రబాబు వెళ్లిపోయాడని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. అయినా కూడ పేదలకు రాష్ట్రంలో ఒక్క ఇళ్లు కూడ నిర్మించకుండానే బాబు రాష్ట్ర ప్రజలకు మొండిచేయి చూపారన్నారు.

మంగళవారం నాడు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. పేదలకు ఇళ్లు ఇస్తోంటే టీడీపీ అడ్డుకొంటుందన్నారు. పేదలపై ప్రతాపం చూపిస్తున్నారని ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల నెత్తిన రూ. 4300 కోట్లు అప్పులు మోపాడన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టకపోయినా కూడ హైద్రాబాద్ లో మాత్రం వందల కోట్లతో సుందర భవనాన్ని నిర్మించుకొన్నాడని ఆయన విమర్శించారు.రాష్ట్ర ప్రజలపై ఎందుకు కోపమని ఆయన ప్రశ్నించారు. 

also read:ఇళ్లపట్టాలకు అడ్డుకాదు, వైసీపీ అవినీతికే వ్యతిరేకం: చంద్రబాబు

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు పేదలకు ఇళ్లు నిర్మించలేదని ఆయన విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు  ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ముందుకు వస్తే కేసులు వేసి అడ్డుకొన్నారని ఆయన ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ను ఎదుర్కొలేక చంద్రబాబునాయుడు చతికిలపడ్డారన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ చేతిలో చంద్రబాబు దెబ్బతిన్నారన్నారు. కడప ఎంపీ స్థానంలో జగన్ 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.