అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జోగి రమేష్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఇసుక దోపిడీపై ప్రస్తావిస్తూ జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో ఇసుకను టీడీపీ నేతలు దోచేశారంటూ విరుచుకుపడ్డారు. కృష్ణా నదిలోని ఇసుకను గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఇసుక నదిలోనో, చెరువుల్లోనే లేదని, అది టీడీపీ నేతల పొట్టల్లో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

దానిని కక్కిస్తే ఇసుక కొరత తీరుతుందని అభిప్రాయపడ్డారు. విచ్చలవిడి ఇసుక దోపిడీ కారణంగా గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ రూ. 100 కోట్ల పెనాల్టీ విధించిందని జోగి రమేష్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వమే భవన కార్మికుల పొట్ట కొట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలోని ఇసుక కొరత కారణంగా భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటూ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ నేతలు సభ దృష్టికి తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు అవలంబించిన ఇసుక దోపిడీ కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని జోగీ రమేశ్‌ స్పష్టం చేశారు.