Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ ఇంట్లో మద్యం, ఏరులై పారుతోందన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. మొన్నటివరకు ఇసుక, టీడీపీ నేతలపై దాడులు, ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.  
 

ysrcp mla gadikota srikanthreddy serious comments on chandrabau &nara lokesh
Author
Amaravathi, First Published Nov 20, 2019, 4:46 PM IST

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. మొన్నటివరకు ఇసుక, టీడీపీ నేతలపై దాడులు, ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.  

రాజకీయాలకు ఏవీ అతీతం కాదన్నట్లు చంద్రబాబు ఆయన కుమారు నారా లోకేష్ కులమతాలను రెచ్చగొట్టేందుకు కూడా దిగజారిపోయారంటూ విమర్శించారు. ప్రభుత్వ పనితీరును ప్రశంసించాల్సిందిపోయి కుట్రలు పన్నుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలపై కేసులు పెడుతుంటే చంద్రబాబు నాయుడు పోలీసులను సైతం బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. పోలీసులను బెదిరించే ధోరణికి చంద్రబాబు దిగజారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు కాల్‌ మని సెక్స్‌ రాకెట్‌ వంటి ఘోరాలకు పాల్పడితే వదిలేయండి అంటూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు.  

ఆధారాలతో సహా కేసులు పెడుతుంటే తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు   హయాంలోలా పోలీసులు చట్ట వ్యతిరేకంగా పనిచేయరని స్పష్టం చేశారు. 

తమది ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. అందువల్లే చట్టబద్దమైన పాలన కొనసాగుతుందన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు  కాదని అంతా సమానమేనని విమర్శించారు. వైసీపీలో సైతం ఎంతపెద్ద వ్యక్తి తప్పుచేసినా చర్యలు తీసుకోబడతాయని మీలా తప్పులు చేస్తూ హత్యా రాజకీయాలు చేస్తున్నా చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు.  

రాష్ట్రంలో ఏ పార్టీ వ్యక్తి అయినా తప్పులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
 చంద్రబాబకు నోటీసులు ఇవ్వడంపై తనకే నోటీసులు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని నీవేమైనా చట్టానికి అతీతుడివా అంటూ నిలదీశారు. చంద్రబాబు తప్పుచేసినా నోటీసులు ఇస్తారని అవసరమైతే కేసులు సైతం పెడతారని హెచ్చరించారు. 

అనేక కేసులు ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని ప్రభాకర్ ను బాబాగా చంద్రబాబు అభివర్ణిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. చింతమనేని అరాచకాలను ప్రోత్సహించేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. 

చింతనిప్పులా ఉండే చింతమనేని ప్రభాకర్‌ పై కేసులు పెడతారా అని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించడంపై మండిపడ్డారు. చింతమనేని దాడులకు భయపడి కేసులు పెట్టకూడదనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి, లంచం ఉండవని గర్వంగా చెప్తున్నట్లు తెలిపారు. సిఫార్సులు ఉండవని అధికారం అందరిదీనని కొందరికే కాదని చెప్పుకొచ్చారు. నిరుద్యోగయువతకు ఉద్యోగాలు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

సచివాలయాలలో వాలంటీర్లతో కలుపుకుని నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే చెందిందని చెప్పుకొచ్చారు. ఇకపై ప్రతీ ఏడాది జనవరిలో రిక్రూట్‌ మెంట్‌ క్యాలండర్‌ ప్రకటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.ఆటోకార్మికులు, మత్స్యకారులకు ఆర్దికసహాయం చేసినట్లు గుర్తు చేశారు. ఉగాది నాటికి 25 లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నట్లు చెప్పుకొచ్చారు. 

ఆరోగ్యశ్రీని బలోపేతం చేశామని అలాగే రైతుల పంటలకు మద్దతు ధరలు ఇస్తున్నట్లు వివరించారు. రాయలసీమలోని వేరుశనగకు రైతులకు నష్టం లేకుండా మధ్దతు ధర ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు శ్రీకాంత్ రెడ్డి. 

జగన్ ప్రభుత్వం ఎన్నో  మంచి కార్యక్రమాలు చేపడుతుందని వాటిపై ఏ మీడియా చర్చలు పెట్టవన్నారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే క్రిస్టియానిటికోసం అంటూ చర్చలేపారని ఇంతలా దిగజారుతారా అంటూ విమర్శించారు. టీడీపీ నేతలు మనుషులా రాక్షసులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇంగ్లీషు మీడియం చదువుకున్నారని వారిలో కొంతమంది ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని అయితే వారంతా క్రిస్టియన్‌ లని ముద్రవేస్తారా? ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

భారతదేశం ప్రజాస్వామ్య దేశమన్న శ్రీకాంత్ రెడ్డి ఏమనిషికి ఏది ఇష్టం ఉంటుందో దానిని గౌరవించాలని రాజ్యాంగం చెప్తోందన్నారు. హిందూత్వం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ఆయన హయాంలో హిందూ దేవాలయాలను ఎన్ని కూల్చారో తెలియదా అంటూ నిలదీశారు. ఎన్ని మసీదులు, చర్చిలు కూల్చావో ప్రజలకు తెలుసునని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని పేదవాడి కోసం ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుత పరిస్దితులలో ఇంగ్లీషు నేర్చుకోవడం ఎంతో అవసరమని ఆలోచనచేస్తే దానిని సైతం వివాదం చేస్తారా అంటూ మండిపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వానికి తెలుగు భాషపైన ప్రేమలేదంటూ ప్రజల్లో క్రియేట్ చేయాలనే భావనతో టీడీపీ కుట్రలు చేస్తుందంటూ విరుచుకుపడ్డారు. తమకు భాష, తెలుగు సంస్కృతిలపైన ఉన్న ప్రేమ, చిత్తశుద్ది ప్రత్యేకించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని ప్రజలకు తెలుసునన్నారు.  

ఇన్ని మంచిపనులు చేస్తున్నా చంద్రబాబు అండ్‌ కో కు ఎందుకు కనబడటం లేదని ప్రశ్నించారు శ్రీకాంత్ రెడ్డి. ఎంతసేపటికి జగన్‌ కులం, మతం గురించే చర్చిస్తారా అంటూ తిట్టిపోశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మతాలను, కులాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం తగదన్నారు. 

2004లో బిజేపిని వదలం అని 2009లో బీజేపీ మతతత్వ పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు 2014లో తిరిగి పొత్తుపెట్టుకున్నావని ఆ తర్వాత 2018లో మోడిని తిట్టిన విషయం మరచిపోయావా అంటూ నిలదీశారు.  

2019 ఎన్నికలలో సైతం నరేంద్రమోదీపై నానా దుర్భాషలాడిన విషయాన్ని గుర్తు చేశారు. తీరా ఎన్నికలు అయ్యాక తిరిగి నరేంద్రమోదీ కాళ్లు పట్టుకున్నావు అంటూ నిప్పులు చెరిగారు. ఈరోజు తాను సెక్యులర్‌ వాదిని అని గట్టిగా చెప్పలేకపోతున్న వ్యక్తి చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

కాంగ్రెస్‌ వెనక తిరిగి అధినేత్రి సోనియాగాంధి కాళ్లు పట్టుకున్నావని రాజ్యసభలో మీ పార్టీని క్లోజ్‌ చేసుకున్నది వాస్తవం కాదా అని నిలదీశారు. తెలంగాణాలో చంద్రబాబు పార్టీ ఫర్‌ సేల్‌ అని బోర్డు పెట్టుకుందన్నారు. త్వరలోనే ఏపీలో కూడా టీడీపీ ఖాళీ అయిపోవడం ఖాయమన్నారు. 

చంద్రబాబుకు 23 స్దానాలు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు బాధ పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మీలాంటి కుట్రదారుడికి 23 సీట్లు ఇవ్వడంపై చింతిస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ పాలనపై ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. 

ప్రజలు సంతోషంగా ఉంటే అది చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎల్లో మీడియా అండ ఉందని దిగజారుడు మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలిపారు.  

ఈ సందర్భంగా నారా లోకేష్ పై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్ రెడ్డి. లోకేష్ పనిపాట లేకుండా రోజూ ట్వీట్లు చేస్తున్నాడంటూ మండిపడ్డారు. దొంగపేపర్, మాయా టీవి అంటూ వయస్సుకు మించిన మాటలు మాట్లాడారని అందువల్లే చంద్రబాబు పరిస్థితి ఇలా అయ్యిందన్నారు. ఇలాగే మాట్లాడితే టీడీపీ ఖచ్చితంగా ఖాళీ అయితుందని జోస్యం చెప్పారు.  

తెలంగాణాలో టీడీపీ ఖాళీ అయిపోయిందని, రాజ్యసభలో కూడా అంతేనని ఇక ఆంధ్రాలో కూడా రెడీగా ఉందన్నారు. ఏ టీడీపీ ఎమ్మెల్యే తిడతాడో అని చంద్రబాబు అండ్ కో వణికిపోతున్నారని చెప్పుకొచ్చారు.  

వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందంటున్న లోకేష్ వ్యాఖ్యలను ఖండించారు. లోకేష్ నివాసంలోనే మద్యం ఉందన్నారు. లోకేష్ దాచుకున్న మద్యమే ఇంట్లో ఏరులై పారుతుందేమోనంటూ సెటైర్లు వేశారు.  

అయితే తమ ప్రభుత్వం మాత్ర ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేసి తీరతామన్నారు. ఇప్పటికే బెల్ట్‌ షాపులను రద్దు చేమని 4,358 మద్యం దుకాణాలను 3,500 షాపులకు తగ్గించినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అక్కచెల్లెళ్లు ముఖాలలో చిరునవ్వులు చూసేందుకు బార్ల సంఖ్యను కూడా తగ్గించినట్లు చెప్పుకొచ్చారు.  

వైసీపీ నేతలు మద్యం పారిస్తున్నారు, ఇసుక అమ్ముతున్నారని టీడీపీ ఆరోపిస్తుందని ఎక్కడో నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు. టెక్నాలజీ అందుబాటులో ఉందని సెల్ ఫోన్ లో చిత్రీకరించి వీడియో తీసి ఫిర్యాదు చేయోచ్చని సూచించారు.  

వైసీపీ నేతలు సైతం అరాచకాలు చేసినా తమ దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి ఉండకూడదని కింది స్థాయి నుంచే అవినీతిని తరిమికొట్టాలన్న లక్ష్యంతో జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.  

పొలిటికల్‌ కరప్షన్‌ ను సైతం కంట్రోల్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఏసిబిని బలోపేతం చేసి అవినీతిని లేకుండా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తప్పులు ఎత్తిచూపండి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు లోకేష్ లకు తెలిపారు. 

పోలీసు, రెవిన్యూ విభాగాలలో కూడా అవినీతి ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పై స్థాయిలో అవినీతి ఉండకూడదని రివర్స్ టెండరింగ్ తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ఇసుక కాంట్రాక్టర్లు 12 శాతం కమీషన్ తీసుకునేవారని ఇప్పుడు అవి నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు.  

ఒక నియోజకవర్గంలో ఇద్దరు నేతలమధ్య రాజీ కుదర్చడం కోసం కమిషన్లను సైతం చంద్రబాబు పంపిణీ చేశారని ఆరోపించారు. వ్యవస్దలను దిగజార్చిన వ్యక్తి చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. తప్పు చేస్తే ఎంతటి పెద్ద వ్యక్తి అయినా ఉపేక్షించేది లేదన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios