టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. పలనాడులో చిన్న చిన్న గొడవలు జరిగితే వాటికి రాజకీయ రంగు పులుముతూ శిబిరాలు పెడుతున్నారంటూ ఆరోపించారు.

అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు అనేక అరాచకాలకు పాల్పడ్డారని.. టీడీపీ బాధిత శిబిరం పెడితే కరకట్ట మొత్తం నిండిపోతుందని శ్రీకాంత్ రెడ్డి సెటైర్లు వేశారు. తమ అవినీతి నుంచి జనం దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు రాజధాని మార్పుపై ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఓడిపోతానని తెలిసే చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని.. అందుకే జగన్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా తన అనుకూల మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

తన హయాంలో లక్షల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిన చంద్రబాబు.. రెండున్నర లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్రంపై మోపారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. నాడు ప్రతిపక్షాన్ని విమర్శించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు చేసిన అవినీతిపై ఎందుకు ట్వీట్లు చేయడం లేదో అర్ధం కావడం లేదంటూ దుయ్యబట్టారు.

వైఎస్ వివేకాను చంపించింది బాబు ప్రభుత్వమేనని.. వంగవీటి రంగాను, చివరికి మీడియా ప్రతినిధులను సైతం చంద్రబాబు చంపించారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేత చెరుకూరి నారాయణరెడ్డిని హత్య చేయలేదా...ఇడుపులపాయలో డ్రోన్‌తో ఫోటోలు తీయలేదా అంటూ మండిపడ్డారు.

పల్నాడులో మాజీ టీడీపీ ఎమ్మెల్యేలు యరపతినేని, కోడెల అరాచకాలకు పాల్పడ్డారని.. కాల్ మనీ సెక్స్ రాకెట్ మీద చంద్రబాబు శిబిరం నిర్వహించగలరా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

జన్మభూమి కమిటీల అరాచకాలపై బాబుకు నచ్చిన 10 గ్రామాల్లో చర్చ పెడదామని.. అందుకు ప్రతిపక్షనేత సిద్ధమా అని సవాల్ విసిరారు.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు పాల్పడ్డ.. కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

ఫ్యాక్షనిస్టులు, రేపిస్టులు టీడీపీలోనే ఉన్నారంటూ శ్రీకాంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. పేదలకు అందుబాటులో ఉండేలా.. పబ్లిసిటీకి దూరంగా సీఎం పరిపాలన చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని.. త్వరలోనే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.