మంత్రి మేకపాటి గౌతంరెడ్డి (mekapati goutham reddy) మరణంపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు శవాల దగ్గర నెత్తురుకూడు తినే సన్నాసులు అని మండిపడ్డారు

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి (mekapati goutham reddy) మరణంపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఒక బడుద్ధాయి అంటూ రాజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ నేతలు శవాల దగ్గర నెత్తురుకూడు తినే సన్నాసులు అని మండిపడ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తాడు బొంగరం లేదని.. టీడీపీ లో బండారు లాంటి లుచ్చా నాయకులే ఉన్నారంటూ దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అకాల మరణం చెందిన వివాద రహితుడైన గౌతమ్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయదానికి సిగ్గు లేదా..? అని ప్రశ్నించారు . ఈ వ్యాఖ్యలు చంద్రబాబు చేయమన్నాడా..? యనమలకి తునిలో సత్తా లేకే పక్క జిల్లాలోని పత్తాలేని నాయకులను తీసుకొచ్చి మీటింగులు పెడుతున్నాడని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమల ఒక ముసలోడు ఆ ముసలోడు యువత కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. 

అంతకుముందు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి (vijayasai reddy) ఈ వ్యవహారంపై స్పందిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. 'ఒక నాయకుడు మరణిస్తే హుందాగా నివాళులు అర్పించాల్సింది పోయి.. నీచమైన కామెంట్స్ చేయడం టీడీపీ నేతలకే సాధ్యం. ఆ పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి మాటలు వింటే...టీడీపీ మానసిక వైకల్యం అర్థ‌మవుతుంది. పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన పార్టీ. ఆర్ఐపీ వైజాగ్ టీడీపీ' అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

విజ‌యసాయిరెడ్డి ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు కౌంట‌ర్ ఇచ్చారు. 'గురువింద కూతలు నువ్వే కూయాలి కసాయి! శవం దొరికితే రాజకీయం చేసే జగన్ రెడ్డి అండ్ కో కూడా నీతులు మాట్లాడటం విడ్డురంగా ఉంది' అని ఆయ‌న అన్నారు. గ‌తంలో విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఓ ట్వీటునూ ఈ సంద‌ర్భంగా అయ్య‌న్న పాత్రుడు పోస్ట్ చేశారు.

నిన్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణంపై టీడీపీ (tdp) నేత బండారు సత్యనారాయణ (bandaru satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్‌రెడ్డి మరణంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. దుబాయ్‌లో వుండగా గౌతమ్‌రెడ్డిని బెదిరించింది ఎవరని బండారు ప్రశ్నించారు. బెదిరించడం వల్లే ఆయన గుండెపోటుకు గురయ్యారని.. పరిశ్రమలు తీసుకురావాలని గౌతంరెడ్డిని మానసిక క్షోభకు గురిచేశారని బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బండారు వ్యాఖ్యలను వైసీపీ ఖండించింది. గౌతంరెడ్డి కుటుంబానికి బండారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. తప్పుడు వ్యాఖ్యలు, వక్రీకరణలకు బండారు పాల్పడ్డారని మండిపడింది. బండారు మానసిక స్థితిని తక్షణమే పరిశీలించాలని మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్ చురకలు వేశారు.