హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు చాలా వింతగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన బుగ్గన ఎన్నికల కోడ్ అమలులో ఉండగా చంద్రబాబు రివ్యూలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఆపద్ధర్మ సీఎం హోదాలో అత్యవసర సమయాల్లో మాత్రమే రివ్యూ నిర్వహించాల్సి ఉంటుందని కానీ చంద్రబాబు మాత్రం ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ రివ్యూలు నిర్వహిస్తున్నారన్నారు. 

అసలు పోలవరం ప్రాజెక్టుపై అత్యవసరంగా రివ్యూ నిర్వహించాల్సిన అవసరం ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు అధికారులపై దాడులకు దిగుతున్నారని అది సరికాదన్నారు. 

ప్రత్యక్షంగా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నా పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదో తెలియడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న తీరు చూస్తుంటే జాలేస్తోందన్నారు. చంద్రబాబు సీఎంలా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. కోడ్ ఉండగా రివ్యూలు నిర్వహించకూడదన్న విషయం చంద్రబాబు నాయుడుకు తెలియదా అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలదీశారు.