జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. ఒక్క గజమైనా ఆక్రమించినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమన్నారు. భూములు కొట్టేస్తామని, రియల్ ఎస్టేట్‌కు అమ్మేస్తున్నామని అనడం సరికాదని శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని అన్నారు. ఒక్క గజమైనా ఆక్రమించినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. రుషికొండ వద్ద ఏపీ పర్యాటక శాఖ నిర్మిస్తోన్న ఫైవ్‌స్టార్ హోటల్‌పై పవన్ చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలైనా అక్కడ సాగించవచ్చన్నారు. భూములు కొట్టేస్తామని, రియల్ ఎస్టేట్‌కు అమ్మేస్తున్నామని అనడం సరికాదని శ్రీనివాస్ పేర్కొన్నారు.
అంతకుముందు బుధవారంనాడు విశాఖపట్టణంలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు.ఎర్రమట్టి దిబ్బల గురించి స్థానిక జనసేన నేత సందీప్ పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ దృష్టికి తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.తెలంగాణలో పర్యావరణాన్ని విధ్వంసం చేశారన్నారు. టూరిజం ముసుగులో అక్రమాలు జరిగాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
ఉత్తరాంధ్రలో కూడ పర్యావరణాన్ని విధ్వసం చేస్తున్నారని ఆయన వైసీపీపై మండిపడ్డారు. ప్రైవేట్ ఆస్తులకు , గవర్నమెంట్ కు ఏం సంబంధమని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజల ఆస్తిని ప్రభుత్వం జాగ్రత్తగా కాపాడాలన్నారు. ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపదగా పవన్ పేర్కొన్నారు. 1200 ఎకరాలుండే ఎర్రమట్టి దిబ్బలు చివరికి 292 ఎకరాలే మిగిలాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జాతీయ సంపదైన ఎర్రమట్టి దిబ్బలను ప్రభుత్వం రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రమట్టి దిబ్బల వద్ద రియల్ ఏస్టేట్ వెంచర్లు వేస్తున్నారని పవన్ మండిపడ్డారు.
