చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ అల్లుడు అన్న హోదా లేకుంటే నారా లోకేశ్ పరిస్ధితి ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎన్నికల్లో తుక్కు తుక్కుగా ఓడిపోయిన లోకేశ్... జగన్‌ని నేరుగా చూసే సత్తా ఉంటుందా అని మండిపడ్డారు.

లోకేశ్‌ను నాయకుడిగా చేసేందుకు చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినా ఫలితం శూన్యమన్నారు. లోకేశ్ ఫస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని.. డైలాగ్‌లు రాసిస్తే మాట్లాడటం కాదంటూ అంబటి ఘాటు వ్యాఖ్యానించారు. లోకేశ్, చంద్రబాబు నిబంధనల ప్రకారం వ్యవహరించకుంటే, చట్టం చూస్తూ ఊరుకోదని రాంబాబు అన్నారు.

Also Read:టీడీపీ నేతల హత్యకు కొందరి కుట్ర.. నాకేమో జూన్ 22 డెడ్‌లైన్: బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుకు  ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించే చిత్తశుద్ధి లేదని అంబటి వ్యాఖ్యానించారు. ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని రాంబాబు తెలిపారు.

ఆధారాలుంటేనే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని, ఉత్త పుణ్యానికి ఎవరిని జైల్లో పెట్టరని వ్యాఖ్యానించారు అంబటి . సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఎవరి మీదా కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదని, పైగా టీడీపీకి అంత సీన్ లేదని తేల్చి చెప్పారు.

మళ్లీ ఎన్నికలు వస్తే బతికి బట్టకట్టే పరిస్ధితి తెలుగుదేశానికి లేదని, 23 స్థానాలకు పరిమితమవ్వడంతో పాటు రానురాను మరింత దిగజారిపోతోందని అంబటి అన్నారు. తమకు ప్రమాదకరమని భావిస్తేనే ఏ రాజకీయ పార్టీపైనైనా కక్ష సాధించేందుకు పూనుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read:అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. నారాలోకేష్

ఏపీలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేదని.. కానీ ఇప్పుడు అధ: పాతాళానికి వెళ్లిపోయిందని, అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని పరిస్ధితి ఏర్పడిందని అంబటి గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు ఎలాంటి గతి పట్టిందో, అదే గతి పట్టేందుకు సిద్ధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద మేము ఎందుకు కక్షగడతామని ఆయన ప్రశ్నించారు.

ఫైబర్ గ్రిడ్, మజ్జిగ, చంద్రన్న కానుక వంటి వాటి ద్వారా వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని రాంబాబు ఆరోపించారు. అమరావతి నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద స్కామ్ అన్న ఆయన వాస్తవాలు బయటకు వస్తే ఎంతమంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళతారో చెప్పలేమన్నారు.