గుంటూరు: లాక్ డౌన్ నిబంధనలను ఉళ్లంఘించిన యువకుడిపై  పోలీసులు దాడి చేయడంతో సత్తెనపల్లిలో ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన పోలీసులపై సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. మృతుడి  కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 

ఎంతో ప్రశాంతంగా వుండే సత్తెనపల్లిలో పోలీస్ దెబ్బల కారణంగా ఒకరు చనిపోవడం ఎంతో బాధ కలిగించిందని  ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.  అత్యవసర పనిపై బయటకు వచ్చిన గౌస్ పై పోలీసులు మాన్ హ్యాండ్లింగ్  చేసినట్లు తెలిసిందని.. దీనికి కారణమైన ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిపై జిల్లా ఎస్పీతో మాట్లాడటం జరిగిందని అంబటి తెలిపారు. 

చనిపోయిన గౌస్ కుటుంబ సభ్యులకు అండగా వుంటామని... ఇలాంటి  ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శిస్తానని ఆయన తెలిపారు.

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో మెడికల్ షాపునకు వచ్చిన యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సత్తెనపల్లి చెక్ పోస్టు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల దెబ్బలకు యువకుడు మహ్మద్ గౌస్ అక్కడే  కుప్పకూలడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృత్యువాత పడ్డాడు. దీంతో ఆగ్రహించిన యువకుడి బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో పోలీసు స్టేషన్ ముందు వారు ధర్నాకు దిగారు. 

మందుల కోసం ఆ యువకుడు మందుల షాపునకు వచ్చాడు. లాక్ డౌన్ అమలవుతోందని, ఎందుకు బయటకు వచ్చావంటూ పోలీసులు అతన్ని చితకబాదారు. ఆందోళనకారులు పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానం గుంటూరు జిల్లా ఆక్రమించింది. దీంతో గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.