అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఆశా వర్కర్లకు సంబంధించి చంద్రబాబు చేసిన ట్వీట్‌ ఒక అబద్దం అంటూ స్పష్టం చేశారు. 

చంద్రబాబు అబద్దాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకు చేసిన అబద్దపు ప్రచారాల వల్లే టీడీపీకి 23 సీట్లు వచ్చాయంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సీఎం   జగన్‌ పాలనను మెచ్చుకోకున్నా ఫర్వాలేదు గానీ ప్రభుత్వంపై అనవసరంగా బురద చల్లవద్దంటూ హెచ్చరించారు.  

తాను పాలిచ్చే ఆవునని చెప్పుకుంటున్న చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదని రక్తాన్ని పీల్చే జలగ అని విమర్శించారు. తమ దేశంలో చంద్రబాబులా మాట్లాడితే మెంటల్‌ ఆసుపత్రిలో వేస్తారని స్విట్జర్లాండ్‌ మంత్రి ఎప్పుడో చెప్పారని అంబటి గుర్తు చేశారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదర్కొందని, ఎన్నో కష్టాలను ఓర్చుకున్న యోధుడు వైయస్ జగన్ అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో  చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వైసీపీని అంతం చేస్తానని బెదిరించారని గుర్తు చేశారు. 

చంద్రబాబు బెదిరింపులకు గానీ, చర్యలకు గానీ ఏనాడు జగన్ వెనకడుగు వేయకుండా పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారని తెలిపారు. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చి కనుమరుగైపోయినా వైసీపీ మాత్రం వెనుతిరగలేదని స్పష్టం చేశారు.  

2017లో తెలంగాణలో జరిగిన ఆందోళనలో ఫోటో పెట్టి చంద్రబాబు అబద్దాలు చెప్పారని విమర్శించారు. బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ మరో అబద్దాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని దాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారంటూ అంబటి రాంబాబు చురకలంటించారు.