న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు  వైసీపీ ఓకే చెప్పింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి,  ఎమ్మెల్సీ  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు  మంగళవారం నాడు న్యూఢిల్లీలో లా కమిషన్ ఛైర్మెన్‌ను కలిసి తమ పార్టీ అభిప్రాయాన్ని వివరించారు.

జమిలి ఎన్నికలకు తాము అనుకూలమని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  రాసిన లేఖను  వైసీపీ నేతలు లా కమిషన్ ఛైర్మెన్ కు అందించారు. 

జమిలి ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలను కూడ వివరించినట్టు   వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.  జమిలి ఎన్నికల వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తాము లా కమిషన్ కు సూచించినట్టు ఆయన తెలిపారు. 

జమిలి ఎన్నికల కోసం పలు రాజకీయ పార్టీల నుండి ఏకాభిప్రాయాన్ని సాధించాలని తాము  లా కమిషన్ కు సూచించినట్టు ఆయన చెప్పారు.  జమిలి ఎన్నికల వల్ల దేశానికి ప్రయోజనమే కలుగుతోందని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. 

 ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల  ఓటుకు నోటు లాంటి కేసులు రావని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  ఖర్చు తక్కువ అవుతోంది. అవినీతి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. 

 1999 నుండి ఇప్పటివరకు ఏపీ రాష్ట్రంలో జమిలి ఎన్నికలే జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 1951 నుండి 1962 వరకు జమిలి ఎన్నికలే జరిగాయని ఆయన గుర్తు చేశారు. దేశంలో అభివృద్ధి కోసం జమిలి ఎన్నికలను తాము స్వాగతిస్తున్నట్టు ఆయన చెప్పారు.