అమరావతి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు ఏమాత్రం తగ్గడం లేదు. స్పీకర్ కోడెల శివప్రసాద్ సై అంటే సై సై అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు ఇతర నేతలు. ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసుకుంటున్నారు. 

తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఫిర్యాదు చేశారు. ఇనిమెట్లలోని 160 పోలింగ్ బూత్ లో కోడెల శివప్రసాదరావు దౌర్జన్యానికి దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి వీడియోలను అందజేశారు. 

దౌర్జన్యానికి సంబంధించి రాజుపాలెం పీఎస్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పదించలేదని పేర్కొన్నారు. దౌర్జన్యం చేసిన స్పీకర్ కోడెలతో కుమ్మక్కై వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టారని అంబటి రాంబాబు ఆరోపంచారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాతే కోడెలపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. 

చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఏప్రిల్ 11న ఇనిమెట్ల గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా లోపలికి వెళ్లి స్పీకర్ కోడెల శివప్రసాదరావు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. 

కోడెల చర్యలను నిరసిస్తూ ఓటర్లు నిరసన తెలిపారని అంతేకాని ఎలాంటి దాడి జరగలేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సిఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన వారిలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్, సామినేని ఉదయభాను, ఎంవీఎస్ నాగిరెడ్డిలు ఉన్నారు.