ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరంలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్. అమెరికా వెళ్ళేది లేదు...గన్నవరం లోనే ఉంటా...ఇక్కడే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా వెళ్ళేది లేదు...గన్నవరం లోనే ఉంటా...ఇక్కడే పోటీ చేస్తానని స్పష్టం చేశారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్. ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరంలో ఆయన కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు . ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తీర్చాలని నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేశానని వెంకట్రావ్ తెలిపారు.
నాలుగేళ్ల నుంచి కార్యకర్తల మీటింగ్ పెట్టలేదని చాలా మంది తన దృష్టికి తీసుకొచ్చారని.. అందుకే ఈ సమావేశం పెట్టానని ఆయన వెల్లడించారు. 2017లో రాజకీయాల మీద ఆసక్తితో అమెరికా నుంచి వచ్చి జగన్‌ను కలిశానని వెంకట్రావ్ తెలిపారు. ఈ సందర్భంగా పెనమలూరులో పోటీ చేయమని జగన్ కోరారని యార్లగడ్డ వెల్లడించారు. దీనికి కారణం లేకపోలేదని.. ఉయ్యూరులోనే తాను చదువుకున్నానని, బంధుమిత్రులు, ఇతర సన్నిహిత సంబంధాలు తనకు అక్కడే వున్నాయన్నారు. అయితే గన్నవరంలో పార్టీ పరిస్థితి బాలేదని.. కనీసం 30 శాతం కూడా ఓటు బ్యాంక్ లేదని అక్కడ వైసీపీని నిలబెట్టాలని జగన్ తనకు సూచించారని యార్లగడ్డ వెల్లడించారు.
ALso Read: జగన్ నన్ను క్రాస్ రోడ్డులో నిలబెట్టారు.. గన్నవరం టికెట్ ఇస్తారనే అనుకుంటున్నా : యార్లగడ్డ వెంకట్రావ్
మీటింగ్ కు వచ్చే వాళ్ళను వేధింపులకు గురిచేయడం తో కొంతమంది ఆగిపోయారని, మన కార్యకర్తలు మీద కేసులు తీయలేదని యార్లగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం మన చేతిలో ఉన్నా ఏమీ చేయలేకపోయామన్నారు. దుట్టా నిన్ను నడిపిస్తాడు అని చెప్పి సీఎం జగన్ గన్నవరం సీటు ప్రకటించారని వెంకట్రావ్ తెలిపారు. గన్నవరం సెక్యూలర్ నియోజకవర్గమని.. ఇక్కడి నుంచి రెండుసార్లు ఇండిపెండెంట్ లు గెలిచారని ఆయన గుర్తుచేశారు.
పార్టీ వీక్ గా ఉన్న సమయంలో పాదయాత్ర ద్వారా ప్రతి వ్యక్తిని కలిశానని.. దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచారని వంశీపై ఆయన ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు తనపై అనేక కేసులు పెట్టారని.. దురదృష్టవశాత్తు 270 ఓట్లతో మాత్రమే ఓడిపోయానని యార్లగడ్ద వెల్లడించారు. ఎమ్మెల్యే కావాలన్న నా కోరిక తీరకపోయినా కార్యకర్తల కొరికలు తీరుతాయని అనుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యే ను తీసుకుని సీఎం దగ్గరకు వెళ్లారని.. తనను,దుట్టాను పిలిచి మాట్లాడతారని అనుకున్నానని యార్లగడ్డ తెలిపారు. వంశీతో కలిసి పనిచేయాలని సీఎం సూచించినా నా వల్ల కాదని చెప్పానని ఆయన వెల్లడించారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం గన్నవరం లో ఉంటానని చెప్పానని.. 2024లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని యార్లగడ్డ తేల్చేశారు. కార్యకర్తల సంక్షేమం జిల్లా మంత్రులు చూస్తారని చెప్పారని.. నియోజకవర్గంలో ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
ఎమ్మెల్సీఇస్తానని సీఎం చెప్తే వద్దన్నానని ఆయన వెల్లడించారు. అన్నం తినేవారు ఎవరూ వైసీపీలో చేరరు అని వంశీ అన్నారని.. జగన్ పాదయాత్రలో గన్నవరంలో షెల్టర్ కూడా ఇవ్వలేదని వెంకట్రావ్ గుర్తుచేశారు. వంశీతో కలిస్తే నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చేదని అయినా కలవలేదని, తనకు అన్యాయం చేయనని సీఎం జగన్ చెప్పారని యార్లగడ్డ తెలిపారు. విజయవాడ ఎంపీ గా పోటీ చేయాలని పార్టీలో పెద్ద మనిషి కోరారని.. గన్నవరం వదులుకొనని ఆయనకు చెప్పానని వెంకట్రావ్ తెలిపారు. అలా చెప్పిన కొన్ని రోజులకే కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి పోయిందని ఆయన పేర్కొన్నారు.
ఎన్ని అవమానాలు వచ్చినా సీఎంను ఒక్క మాట కూడా అనలేదని.. టీడీపీ నుంచి వచ్చిన ముగ్గురికి ఎమ్మెల్సీలు ఇచ్చారు కానీ దుట్టాకు ఏ అర్హత తగ్గిందని వెంకట్రావ్ ప్రశ్నించారు. అన్యాయాన్ని ఎదురించిన వారిని ఇండిపెండెంట్ లుగా గెలిపించారని గుర్తుచేశారు. రెండేళ్ల నుంచి సీఎం ను కలుద్దామంటే అవకాశం ఇవ్వలేదని.. తనకు టిక్కెట్ ఇవ్వాలని సీఎం ను అభ్యర్దిస్తున్నానని యార్లగడ్డ తెలిపారు. టిక్కెట్ ఇవ్వకుంటే గన్నవరం ప్రజలు తన భవిష్యత్తు ను నిర్ణయిస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం టిక్కెట్ ఇవ్వాలని కార్యకర్తల సమక్షంలో సీఎం జగన్ ను అడుగుతున్నానని యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు.
