వైఎస్సార్‌సిపి సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి మరోసారి టిడిపి నాయకులపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మొత్తం ఆర్థిక నేరగాళ్లతో నిండిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపిలో బడా రాజకీయ నాయకులుగా చెలామణీఅవుతున్న ఓ పది మంది బ్యాంకులకు రూ.75వేల కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. వారితో పోలిస్తే ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా చాలా చిన్న చేపని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 

విజయసాయి రెడ్డి గతకొంతకాలంగా ట్విట్టర్ ద్వారా తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇలా పోలింగ్ డే రోజు ఆయన సంచలన ట్వీట్ చేశారు. ''లగడపాటి, సుజనా, రాయపాటి, గంటా, ఇంకో 10 మంది ఆర్థిక నేరగాళ్లు బ్యాంకులకు ఎగ్గొట్టినవి రూ.75 వేల కోట్ల పైమాటే. వీళ్లెవరూ నిజంగా దివాళా తీయలేదు. బినామీల పేర్ల మీద ఆస్తులు బదలాయించి జల్సాలు చేస్తున్నారు. దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా వీళ్లకంటే చాలా చిన్నచేప.'' అని పేర్కొన్నారు. 

విజయసాయి రెడ్డి ఆర్థిక  నేరగాళ్లుగా  పేర్కొన్న నాయకుల్లో లగడపాటి తప్ప మిగతావారంతా టిడిపి పార్టీకి చెందిన వారే. ఇందులో రాయపాటితో పాటు గంటా ప్రస్తుతం టిడిపి తరపును పోటీ చేస్తున్నారు. దీంతో కీలక పోలింగ్ సమయంలో వారిని ఆర్థికనేరగాళ్లంటూ ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. 

ఇక మరో ట్వీట్ లో చంద్రబాబు బుధవారం ఈసీ ఎదుట చేపట్టిన ధర్నా ఓ నాటకమని ఆరోపించారు.  '' ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది దృష్టి మళ్లించడానికే చంద్రబాబు సిఇఓ ముందు ధర్నాకు దిగాడు. గందరగోళం సృష్టించి డబ్బు తరలించే వాహనాలు, వ్యక్తులకు సేఫ్ ప్యాసేజ్ ఇప్పించాలనే ఈ డ్రామాలాడుతున్నాడు. జగనన్న సైనికులు ఇంకో 24 గంటలు రెప్పవాళ్చకుండా పహారా కాయాలి. డబ్బుపంపిణీని అడ్డుకోవాలి.''అని విజయసాయి రెడ్డి సూచించారు.