ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీచ లోక్ సభ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగిందని అధికార టిడిపి పార్టీ ఆరోపించడంపై వైఎస్సార్‌సిపి నాయకులు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో డిల్లీకి వెళ్లి ఈసీఐ తో పోరాటం చేస్తానన్న చంద్రబాబును పచ్చ మీడియా ఏదో పొడిచేస్తాడన్నట్లు చూపించిందన్నారు.  కానీ నిజానికి డిల్లీలో చంద్రబాబు ఈవీఎంల డ్రామా ఏవిఎం సినిమాను మించిపోయేట్లు వుందని తెలిసిందని విజయసాయి రెడ్డి సెటైర్లు  విసిరారు. 

చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికన  విజయసాయి ఘాటుగా స్పందించారు. '' 'ఈసీని ఈజీగా వదిలిపెట్టను, ఢిల్లీ వెళ్ళి అంతుచూస్తా'నని ప్రగల్భాలు పలికారు కదా చంద్రబాబూ. మీ అరుపులు, ఆర్తనాదాలకు ఢిల్లీ కదిలిపోతుందని పచ్చ మీడియా ప్రచారం చేస్తే ఏమో అనుకున్నా. కనీసం చెట్ల ఆకులు కూడా రాలలేదు. ఈసీ ఆఫీసులో మీరు వేసిన ఈవీఎం డ్రామా ఏవీఎం వారి సినిమాను మించిపోయిందటగా!'' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 

మరో ట్వీట్ లో ''చంద్రబాబు బాధేంటో అంతుబట్టడం లేదు. ఫస్ట్ ఫేజ్ లోనే ఎలక్షన్లు నిర్వహించడమేమిటని కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. తనకు చెంచాగిరి చేసే అధికారులను తప్పించారని శాపనార్థాలు పెడతాడు. మెషిన్లు మొరాయిస్తే 80% పోలింగు ఎలా సాధ్యమంటే మాట్లాడడు.యూటర్నులు, సెల్ఫ్ గోల్స్ తో కామెడీ పండిస్తున్నాడు'' అని విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలకు దిగారు. 

'' జీవితాంతం వ్యవస్థల్ని మేనేజ్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఫిర్యాదులుంటే చెప్పొచ్చు. ఇవసలు ఎన్నికలే కావనడం, పోలింగు ముగిసాక ఓటింగ్ మెషిన్లను ట్యాంపర్ చేస్తారనడం మానసిక నియంత్రణ కోల్పోయిన వ్యక్తి చేసే ఆరోపణలు.'' అంటూ ట్వీట్ చేశారు. 

'' ముఖ్యమంత్రి ఆఫీస్ నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా ఉమా? ఎవరూ సొంతంగా తయారు చేయించుకుని ఆఫీసు ముందు తగిలించుకోరు. మీరే ఒక గ్రాఫిక్ నేమ్ ప్లేట్ సృష్టించి దానిపై పిచ్చికూతలు కూస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. ఫ్రస్టేషన్ లో మీ మాటలే కాదు చేతలూ అసహ్యం కలిగిస్తున్నాయి''అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమపై కూడా విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.