విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి విజయం దక్కిందని ఆ పార్టీ నేత సుధాకర్ బాబు స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న పింఛన్‌ పెంపు నిర్ణయం వైసీపీ విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు. 

ఇచ్ఛాపురం ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే ఇప్పుడు పింఛన్ రూ.2000కి పెంచారని ఆరోపించారు. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017 జూలై10న వైసీపీ ప్లీనరి సమావేశంలో నవరత్నాలు ప్రకటించిన సమయంలో పింఛన్ రూ.2000గా ప్రకటించారని గుర్తు చేశారు. వైసీపీ పథకాలను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని ఆరోపించారు. 

మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక, మట్టి, భూమిని కూడా వదలడం లేదని వారి ఆగడాలకు అంతే లేకుండా పోతుందని దుయ్యబుట్టారు. జగన్‌ పాదయాత్ర దళిత, పీడిత ప్రజల్లో మనో ధైర్యం నింపిందని చెప్పుకొచ్చారు. 

 వైసీపీకి భయపడి చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అయ్యారన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీ మాత్రమేనని విమర్శించారు. 

పోలవరం ప్రాజెక్టులో అడ్డగోలుగా దోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్‌ సమిట్‌పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకపోతే తగిన గుణపాఠం చెప్తామని సుధాకర్ బాబు హెచ్చరించారు.