టీడీపీ చీఫ్, ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై బాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సంబంధం లేని అంశాలతో బాబు మాట్లాడుతున్నారని సజ్జల ధ్వజమెత్తారు. మతిస్థిమితం లేనట్లుగా చంద్రబాబు నటిస్తున్నారని.. ముందురోజు మాట్లాడిన విషయం మరుసటి రోజు మరిచిపోతున్నారని రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు.

అమరావతిలో రాజధాని పెడతామని టీడీపీ చెప్పిందా..?, కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఏం చెప్పిందని సజ్జల నిలదీశారు. రాజధానిపై శివరామకృష్షన్ కమిటీ సూచనలను టీడీపీ ప్రభుత్వం పాటించలేదని, పక్కా ప్రణాళిక ప్రకారమే  అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

రియల్ ఎస్టేట్ కోసమే అమరావతిలో రాజధానిని పెట్టారని, రెఫరెన్స్ పాయింట్ లేకుండా రాజధాని ఏర్పాటు చేశారని ఆయన ధ్వజమెత్తారు. గుడ్డి గుర్రానికి పళ్లు తోమేలా  బాబు పరిపాలన సాగిందని, చినుకులు పడితే తడిసేలా భవనాలు నిర్మించారని సజ్జల ఆరోపించారు.

టీడీపీకి మాత్రమే అమరావతి కామధేనువని... ప్రజలకు కాదని ఆయన అభివర్ణించారు. చంద్రబాబు పాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని.. తీర్పు కావాలనుకుంటే టీడీపీయే రాజీనామా చేయాలని సజ్జల సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం ప్రజల కోసమే వికేంద్రీకరణ చేస్తోందని.. వికేంద్రీకరణ చేస్తామని తాము ఎన్నికలకు ముందే చెప్పామని ఆయన స్ఫష్టం చేశారు.