విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ ప్రతిపాదించిన విషయాన్నే ఇవాళ కేటీఆర్ చెప్పారని ఆయన వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక సెంటిమెంట్ అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నేతలకు పైత్యం ఎక్కువైందన్న సజ్జల.. టీడీపీకి తోడు కమ్యూనిస్టులు కూడా కలిశారంటూ దుయ్యబట్టారు. స్టీల్ ప్లాంట్‌పై జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదన చేశారని.. ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోడీతో ఇదే అంశం మాట్లాడారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఆర్టీసీని చంద్రబాబు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి ఆర్టీసీని జగన్.. ప్రభుత్వంలో విలీనం చేశారని సజ్జల గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ విసయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. తమ ప్రభుత్వం ప్లాంట్ వయబులిటీని గురించి ఆలోచిస్తోందని సజ్జల తెలిపారు. సీఎం జగన్ ప్రతిపాదించిన విషయాన్నే ఇవాళ కేటీఆర్ చెప్పారని ఆయన వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అన్న సజ్జల.. ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరణపై అందరికంటే ముందే సీఎం జగన్ స్పందించారని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకునే అంశంపై జగన్ కొన్ని సూచనలు చేశారని సజ్జల వెల్లడించారు. క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని కేంద్రాన్ని జగన్ కోరారని ఆయన తెలిపారు. సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు . చంద్రబాబుకు అధికారం కట్టబెట్లాలన్నది ఎల్లో మీడియా తాపత్రయమని ఆరోపించారు.
ALso Read : సమీపంలోని బయ్యారంకు కుదరదు.. కానీ 1800 కి.మీ దూరంలోని ముంద్రాకు ఎలా సాధ్యం?: కేటీఆర్
అంతకుముందు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనే ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకమా? అనుకూలమా అనే విషయాన్ని కేసీఆర్ సర్కార్ , బీఆర్ఎస్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని కేసీఆర్ చేసిన ప్రకటనను మంత్రి అమర్ నాథ్ గుర్తు చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించిన బీఆర్ఎస్ బిడ్డింగ్ లో ఎలా పాల్గొంటుందని ఆయన ప్రశ్నించారు. బిడ్డింగ్ లో పాల్గొంటే ప్రైవేటీకరణను సమర్ధించినట్టేనని మంత్రి అమర్ నాథ్ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమతో కలిసి రావాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో రాజకీయాలు చేయవద్దని మంత్రి అమర్ నాథ్ బీఆర్ఎస్ నేతలను కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి తమ మద్దతు ఉందని మంత్రి అమర్ నాథ్ గుర్తు చేశారు. రాజకీయ కారణాలతోనే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు , రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు లేదని ఆయన గుర్తు చేశారు.. బీఆర్ఎస్ ఆలోచనల వెనుక రాజకీయ కారణాలున్నాయన్నారు. బీజేపీతో ఉన్న విబేధాలతో స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయంగా వాడుకొనేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని మంత్రి ఆరోపించారు.
