ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధత లేకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ వ్యవహారశైలి టీడీపీకి కొమ్ము కాసేలా వుందన్నారు.

ఉద్యోగులు కూడా కరోనాపై ఆందోళన చెందుతున్నారని సజ్జల తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం పొంచివుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఈ విషయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో తమకు అర్థం కావడం లేదని అన్నారు. 

నిమ్మగడ్డ ఇచ్చిన లేఖకు ప్రతిపాదిక కనిపించడం లేదని సజ్జల అభిప్రాయపడ్డారు. కొద్దిరోజుల క్రితం పలు పార్టీలతో ఎన్నికల నిర్వహణపై ఆయన నిర్వహించిన సమావేశం తీరును కూడా సజ్జల తప్పుబట్టారు.

పోటీలో పార్టీలు, ప్రజల్లో బలం లేని పార్టీలు అభిప్రాయాలు తీసుకుని కోర్టుకు అఫిడవిట్ సమర్పించారని వ్యాఖ్యానించారు. రెండంకెల స్థాయిలో కూడా కరోనా కేసులు లేనప్పుడు ఎన్నికలు రద్దు చేసి.. ఇప్పుడు ఎన్నికలు జరపాలని అనుకోవడం ఏంటని సజ్జల ప్రశ్నించారు.

Also Read:ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ సమరం.. ఎన్నికలు జరిగి తీరాల్సిందే: నిమ్మగడ్డ

అంతకుముందు ఏపీలో ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించారు. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎస్ఈసీ దీనికి సంబంధించిన సమగ్ర షెడ్యూల్ త్వరలో రిలీజ్ చేస్తామని ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. అయితే, ఇప్పుడే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలకు నాలుగు వారాల నుంచి కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు.