ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలతో ఈసీ చర్చించింది.

ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఈసీ చెబుతోంది. కేంద్ర ఆర్ధిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు అవసరమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు.

స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వంతో చర్చించాక ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేస్తామని ఎస్ఈసీ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఏపీఓ కరోనా ఉద్ధృతి తగ్గిందని.. రోజువారీ కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి వచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం పక్క రాష్ట్రం తెలంగాణలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయని ఎస్ఈసీ వెల్లడించారు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదని.. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రమేశ్ కుమార్ చెప్పారు. ఏపీలో ఎన్నికల నిర్వహణ తప్పనిసరని.. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖతో సంపద్రింపులు జరుపుతున్నామని రమేశ్ తెలిపారు. ఇవి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలన్నారు.