టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వివేకా ఫోన్‌లోని రికార్డులను ఎందుకు డిలీట్ చేశారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రెండోసారి విచారణకు హాజరుకానుండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డికి సంబంధాలు వున్నట్లు ఆధారాలు వున్నాయని సజ్జల వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసు నిష్పక్షపాతంగా జరగడం లేదని.. కొందరిని టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ రెడ్డి వెళ్లారని.. వివేకా ఫోన్‌లోని రికార్డులను ఎందుకు డిలీట్ చేశారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. 

బీజేపీలోని కోవర్టుల ద్వారా చంద్రబాబు వివేకా హత్యపై సీబీఐ విచారణను ప్రభావితం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. గతంలో వైఎస్‌పై ఫ్యాక్షనిస్ట్ ముద్ర వేశారని.. ఇప్పుడు జగన్‌పైనా కుట్రలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గతంలో వివేకా హత్యకు , రెండో పెళ్లికి సంబంధం వుందని ఆంధ్రజ్యోతిలో వేశారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగిందని.. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిల ఫోన్ రికార్డులను ఎందుకు చూడలేదని సజ్జల ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చంద్రబాబుదేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఏం చెబితే కింది స్థాయి సీబీఐ అధికారులు అదే చేస్తారని సజ్జల వ్యాఖ్యానించారు.