కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలో వున్నప్పుడు పుష్కరాల్లో భక్తుల్ని బలి తీసుకున్నారని.. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు.
కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. చంద్రబాబులో కనీసం పశ్చాత్తపం కూడా లేదని సజ్జల దుయ్యబట్టారు. సభ జరపాల్సిన చోట కాకుండా ఉద్దేశపూర్వకంగానే ఇరుకు రోడ్డుపై పెట్టారని సజ్జల ఆరోపించారు. ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలో వున్నప్పుడు పుష్కరాల్లో భక్తుల్ని బలి తీసుకున్నారని.. ఇప్పుడు జనం ఎక్కువగా వచ్చారని పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నించారని సజ్జల ఆరోపించారు.
చంద్రబాబులో లెక్కలేనితనం, అహంకారం కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బాబుది శవాలపై పేలాలు ఏరుకునే వైకరంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అనుమతుల్ని చంద్రబాబు పట్టించుకోలేదని.. అనుమతి తీసుకున్న ప్రాంతం కంటే ముందుకెళ్లి సభ పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ఏది జరిగినా సెన్సేషన్ చేసుకోవాలన్నదే చంద్రబాబు ఆరాటమని... చంద్రబాబుకు జనం ప్రాణాలంటే లెక్కలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారవంతమైన ఆలోచనలున్న వ్యక్తిగా కూడా చంద్రబాబు లేరంటూ సజ్జల దుయ్యబట్టారు. ఒక దుర్ఘటనను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు వికృత విన్యాసంలో నరబలి జరిగిందని భావిస్తున్నామని.. డ్రోన్ షాట్‌ల కోసమే జనాల్ని ఇరుకు రోడ్డులోకి తరలించారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
ALso REad: కందుకూరు ఘటనలో దర్యాప్తు ముమ్మరం... ఎఫ్ఐఆర్ నమోదు, ఘటనాస్థలిని పరిశీలించిన డీఐజీ
ఇక, వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనురిస్తుందని ఆరోపిస్తున్న టీడీపీ.. అందుకు నిరసనగా ‘ఇదేమి కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కందకూరులో రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. సభా వేదిక వద్ద ప్రజలు పెద్దఎత్తున గుమిగూడటం.. సభ జరుగుతున్న సమయంలో ప్రజల్లో కొంత తోపులాటలు చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ప్రారంభించగానే.. తొక్కిసలాట చోటుచేసుకుని కొందరు వ్యక్తులు సమీపంలోని కాలువలో పడిపోయారు. వెంటనే సభను ఆపేసిన టీడీపీ నేతలు బాధితులను ఆస్పత్రికి తరలించారు. కొంత మంది గాయాలతో మృతి చెందగా, మరికొందరు ఊపిరాడక మృతి చెందారు.
