ముందస్తు ఎన్నికలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి . చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందస్తు కావాలని కోరుకుంటున్నారని సజ్జల దుయ్యబట్టారు.
ముందస్తు ఎన్నికలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ప్రజా తీర్పు ప్రకారం చివరి రోజు వరకు అధికారంలోనే వుంటామని సజ్జల తెలిపారు. ప్రజల్ని అయోమయానికి గురిచేయొద్దని ఆయన కోరారు. ఈసారి మా ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు బ్యాంక్ వస్తుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, పాలన తీరు వైసీపీని మరోసారి అధికారంలోకి తెస్తాయన్నారు. చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసినా ముందస్తు ఎన్నికలు రావని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ALso Read: వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన, ముందస్తు ఎన్నికలపై మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముందస్తు ఎన్నికలు అనేది చంద్రబాబు గేమ్ ప్లాన్ అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందస్తు కావాలని కోరుకుంటున్నారని సజ్జల దుయ్యబట్టారు. ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్లు రావొద్దని విపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు ఆలస్యమైనా , రాష్ట్ర వాటా నుంచి పనులు ప్రారంభిస్తామని సజ్జల స్పష్టం చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టులు ఎందుకు వద్దంటాయని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. షర్మిల ఒక పార్టీ పెట్టుకున్నాక, ఆమె నిర్ణయాలు ఆమెకుంటాయని, వైసీపీగా మా నిర్ణయాలు మాకుంటాయని ఆయన పేర్కొన్నారు.
