వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 100 శాతం ఫీజు రీయంబర్స్‌మెంట్ జరిగితే.. ఇప్పుడు కనీసం 30 శాతం కూడా రీయంబర్స్‌మెంట్ జరగడం లేదన్నారు వైసీపీ నేత పార్థసారథి. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై బీసీ సభలో ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరమని ఆయన ఎద్దేవా చేశారు.

బీసీల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యం చంద్రబాబుకు లేదని, ఎంతసేపు బీసీలకు తాయిలాలు ఇచ్చి, వారి ఓట్లు కొల్లగొట్టుకోవాలనే చంద్రబాబు ఆలోచిస్తారని పార్థసారథి విమర్శించారు. కొన్ని వందల మంది బీసీ విద్యార్ధులు ఐఐఐటీల్లో ఫీజులు కట్టలేకపోతున్నారని వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

ఏపీసీఎస్సీ నియామకాలలో బలహీన వర్గాలకు నష్టం కలిగే విధంగా నిబంధనలున్నాయని వాటిని మార్చాలని డిమాండ్ చేస్తే కనీసం పట్టించుకోలేదని పార్థసారథి అన్నారు. ఇటీవలమెరిట్‌లో సీట్లు పొందిన బీసీ విద్యార్థుల్ని కనీసం పట్టించుకోలేదన్నారు.

నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు నిర్వహించిన ఈ కేబినెట్ సమావేశం కూడా భూకేటాయింపులు, ఇసుక లేకుండా జరగలేదని పార్థసెంచరీ ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూమిని కోటీశ్వరులకు, పారిశ్రామిక వేత్తలకు అప్పనంగా కేటాయించారని ఆయన ఆరోపించారు.

కానీ కనీసం ఒక్క ఎకరం కూడా బీసీ రైతుకు కానీ, బీసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కానీ కేటాయించారా అని పార్థసారథి ప్రశ్నించారు. టీడీపీ అధికారం వచ్చాకా, ఎవరెవరికీ భూములు కేటాయించారో, ఎవరికి క్వారీలు కేటాయించారో జాబితా చూస్తే చంద్రబాబుకు బీసీలపై ఉన్న ప్రేమ అర్థమవుతుందన్నారు. బీసీలకు వెన్నెముకగా ఉంటామనకుండా.. బీసీలే టీడీపీకి వెన్నెముక అంటూ సీఎం ఉపన్యాసాల్లో చెబుతూ ఉంటారని పార్థసారథి ఎద్దేవా చేశారు.

పూలే పేరుతో రూ.100 కోట్లు వెచ్చించి, బీసీ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి అంటున్నారని.. ఐదేళ్ల క్రితం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నారని, ఐదేళ్లలో ఆయన స్మృతి వనాన్ని నిర్మిస్తానన్న చంద్రబాబు హామీ ఏమైందని దుయ్యబట్టారు. బీసీల్లోని ఎన్నో కులాలు కార్పోరేషన్ డిమాండ్ చేస్తున్నాయని కానీ ముఖ్యమంత్రి ఏనాడు వాటిని పట్టించుకోలేదని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.