అమరావతి: ఏపీలో ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటల సమయం ఉండటంతో ఆయా పార్టీ అభ్యర్థులతోపాటు కార్యకర్తలు సైతం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఫలితాల కోసం అంతా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. 

తమ పార్టీ అధికారంలోకి రావాలని తమ నేత సీఎం కావాలంటూ ఆయా పార్టీలకు చెందిన నేతలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీరి జాబితాలో గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సైతం చేరిపోయారు. 

బుధవారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆయన గుంటూరులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ గెలుపు కోరుతూ 101 కొబ్బరికాయలు కొట్టారు. దేశంలో ప్రధాని నిర్ణయించే స్థాయికి జగన్ ఎదగాలని కోరినట్లు తెలిపారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన మోదుగుల దేవుడిని తాను ఐదు కోరికలు కోరుకున్నట్లు తెలిపారు. మెుదటిది వైఎస్ జగన్ సీఎం కావాలని రెండోది 25 మంది ఎంపీలు గెలవాలని, ప్రధాని అభ్యర్థిని నిర్ణయించే శక్తి జగన్ కు ఇవ్వాలని, మూడోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉండాలని ఆయనకు మంచి బుద్ది ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకోసం తొమ్మిదేళ్లుగా శ్రమిస్తున్న కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం లభించాలని అలాగే ఈ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్న ప్రత్యేక హోదా సాధించే శక్తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని కోరినట్లు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.