హైదరాబాద్: తనపై లైంగిక ఆరోపణలు చేసిన కోటి అనే యువకుడిపై చర్యలు తీసుకునేందుకు వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కోటిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కోటిపై చర్యలు తీసుకోవాలని తన పరువు, మర్యాదలు కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం   తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయిన లక్ష్మీపార్వతి తనపై  సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేశారు. 

కోటి అనే యువకుడితో పాటు కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తిని బిడ్డగా భావించానని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చెయ్యడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. 

ఆరోపణల వెనుక ఉన్న కుట్రలను ఛేదించాలని కోరారు. తనకు న్యాయం చెయ్యాలని కోరారు. ఇకపోతే ఎన్నికలకు ముందు లక్ష్మీపార్వతిపై కోటి అనే యువకుడు బాంబు పేల్చి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాడు. 

తనను లక్ష్మీపార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన కోటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్‌ యూ, లవ్‌ యూ అంటూ మెసేజెస్ పంపుతూ మానసికంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అంతేకాదు తనకు వాట్సప్ లో సెక్స్ వీడియోస్ క్లిప్పింగ్ లు కూడా పంపించినట్లు పేర్కొన్నాడు. కోటి ఫిర్యాదుపై లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని ప్రకటించారు. అందులో భాగంగా లక్ష్మీపార్వతి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.