కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నిప్పులు చెరిగారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు టక్కుటమార విద్యలకు తెరలేపారని విమర్శించారు. 

బుధవారం కాకినాడలో మీడియాతో మాట్లాడిన కన్నబాబు ఓటు బ్యాంక్‌ కోసం చంద్రబాబు కులాల మధ్య  చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరుతో కాపులను ఎన్నిసార్లు మోసం చేస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. 

రిజర్వేషన్ల అంశంపై గతంలో ముంజునాథ కమిషన్‌ను ఎందుకు వేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈబీసీ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకావశం ఉందా అని నిలదీశారు. అగ్రవర్ణ పేదలంతా కాపులకు వ్యతిరేకమవ్వాలనే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

కాపు నేతలపై చంద్రబాబు అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టు తిరిగేలా చేశారని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తానన్న చంద్రబాబు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. 

చంద్రబాబు కాపు కార్పొరేషన్‌కు ఇప్పటివరకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారో చెప్పగలరా అని నిలదీశారు. వైఎస్‌ జగన్‌ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని కన్నబాబు స్పష్టం చేశారు.