అమరావతి: ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

అమరావతిలో శాసనమండలి సభ్యుడిగా జంగా కృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత మండలి చైర్మన్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 

గత ఎన్నికల్లో లేని విధంగా బీసీ సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారని స్పష్టం చేశారు. బీసీలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి తనకు అవకాశం ఇచ్చారని స్పష్టం చేశారు. 

ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు వైఎస్ జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీగా, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రజల కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.