విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆయన కేబినేట్ లో మంత్రి అవుదామని చంద్రబాబు నాయుడు తాపత్రాయపడుతున్నారంటూ విమర్శించారు. 

రాహుల్ గాంధీ పొరపాటున గెలిస్తే చంద్రబాబు కేంద్రమంత్రి అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదన్నారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన దాడి తెలుగు వారి అభ్యున్నతి కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో అత్యధిక సార్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించింది చంద్రబాబు నాయుడేనంటూ ఆరోపించారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించడం నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబుని కొనసాగించడం సరికాదన్నారు. గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని చంద్రబాబును సీఎంగా తొలగించాలని డిమాండ్ చేశారు దాడి వీరభద్రరావు.