విశాఖపట్నం : 2014-19 మధ్య రాష్ట్రంలో జరిగిన ప్రతి అవినీతి వెనుక చంద్రబాబు, లోకేశ్ ల పాత్ర  ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాడి వీరభద్రరావు విమర్శించారు. ఆదివారం నాడు ఆయన  విశాఖపట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

 గత ప్రభుత్వం హయాంలో తండ్రీ కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్ర సంపదను దోచుకున్నారని ధ్వజమెత్తారు.  "చంద్రబాబు వెన్నులో భయం మొదలయిందన్నారు. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే బీసీ లపై దాడులు అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ని అరెస్ట్ చేస్తే రాయలసీమ ఫ్యాక్షన్ అంటున్నారని ఆయన బాబుపై మండిపడ్డారు.

ప్రతి విషయంపై  ఆరోపణలు చేయడం టీడీపీకి  అలవాటుగా మారిపోయిందన్నారు. అవినీతి, దళారి వ్యవస్థ లేకుండా లబ్ధిదారులకు ప్రభుత్వం నేరుగా నగదు అందిస్తోందని తెలిపారు. జగన్ రెడీ అంటే 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారని, జగన్ దయవల్లే టీడీపీ బ్రతికి ఉందని ఆయన పేర్కొన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించింది చంద్రబాబు కాదా అని  ఆయన ప్రశ్నించారు. 

అచ్చెన్నాయుడు మీద ఉన్న ప్రేమ కోడెల శివప్రసాదరావుపై ఎందుకు లేదో చెప్పాలని ఆయన కోరారు. కోడెల ఆత్మహత్య కు చంద్రబాబే కారణమన్నారు.  ఎర్రన్నాయుడు కు స్పీకర్ పదవి వస్తుంటే వద్దన్నది చంద్రబాబేనని ఆయన గుర్తు చేశారు. 

అచ్చెన్నాయుడు బలహీన వర్గాలకు, బీసీ లకు నాయకుడు కాదని ఆయన స్పష్టం చేశారు.తెలుగుదేశం పార్టీ లో బీసీ కుల నేతలుగా చెప్పుకుంటున్న నేతలు తమ కులాలకు ఎం చేశారని ఆయన ప్రశ్నించారు.  బీసీ లకు వైసీపీ న్యాయం చేస్తుంది" అని దాడి వీరభద్రరావు చెప్పారు. ఎన్టీఆర్ హయాంలోనే టీడీపీ బీసీ పార్టీ గా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో టీడీపీ కేవలం డబ్బున్నోళ్ల పార్టీ గా మారిందని ఆయన విమర్శించారు. 

జేసీ ప్రభాకర్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసని, గతంలో ట్రాన్స్ పోర్ట్ అధికారులపై దాడులు చేశారన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం అవుతున్నారని ఆయన విమర్శించారు.

తన మనుషులను దళారులు గా తయారు చేసి తమ కార్యకర్తలను ఆందోళనలు చేయాలని చంద్రబాబు చెబుతున్నారన్నారు. మోడీ దయ వల్ల చంద్రబాబు మనుగడ సాగిస్తున్నారన్నారు. 

అచ్చెనాయుడు వెనుక ఎవరు ఉన్నారో ఆయనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అవినీతి రహిత పాలన లో భాగంగానే జగన్మోహనరెడ్డి అవినీతి నేతల పని పడుతున్నారని తెలిపారు. అవినీతి ని బయట పెడితే కక్షసాధింపు అంటున్నారని, ఏ టైమ్ లో అరెస్ట్ చెయ్యమంటారో మీరే చెప్పండని చంద్రబాబు నాయుడు ను ప్రశ్నించారు.