కడప: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సి.రామచంద్రయ్య. చంద్రబాబు నాయుడు పార్టీని మూసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి, కుంభకోణాలు బయటపడుతున్నాయన్న భయంతో ప్రధాని నరేంద్రమోదీపై ప్రేమఒలక బోస్తున్నారంటూ విమర్శించారు. మోదీ అంటే ద్వేషం లేదంటూ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. 

అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునేవాడిలా చంద్రబాబు నాయుడు తయారయ్యారని ధ్వజమెత్తారు. మధ్యవర్తిత్వం కోసమే బ్రోకర్లను, బినామీలను బీజేపీలోకి పంపించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయక తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విలీనం చేయకపోతే చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఒకవేళ చంద్రబాబును బీజేపీ దగ్గరకు తీసుకుంటే అభాసుపాలుకాక తప్పదంటూ చెప్పుకొచ్చారు. 

ఇకపోతే ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని చెప్పుకొచ్చారు.పెట్టుబడి సహాయంగా రైతు భరోసా డబ్బులను నేరుగా ఖాతాల్లోకి వేయడంతో రైతులంతా ఆనందంగా ఉన్నారన్నారు. 

మంగళవారం ప్రారంభమైన వైయస్ఆర్ రైతు భరోసా పథకంలో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. రైతులను నిలువునా ముంచిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరువు వచ్చి రైతులు అల్లాడుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెప్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. 2004లో దివంగత నేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను చంద్రబాబు వ్యతిరేకించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. 

రాష్ట్రాన్ని దివాళా తీయించిన చంద్రబాబుకు సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. గడువు కంటే ముందే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం జగన్‌ను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. నవరత్నాలను నవగ్రహాలు అని చంద్రబాబు అనడం సిగ్గు చేటని సి.రామచంద్రయ్య తిట్టిపోశారు.