అమరావతి : వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ సీఎం చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు వైసీపీ కీలక నేత సి.రామచంద్రయ్య. చంద్రబాబు అవసరాన్ని బట్టి రంగులు మార్చేస్తారని ఊసరవెల్లికంటే ప్రమాదకరమైన వ్యక్తి అని ఆరోపించారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన సీఆర్ విభజనకు ముందు యూపీఏ చైర్ పర్సన్ సోనియా దెయ్యమని, రాహుల్‌ గాంధీని పనికిరాని వ్యక్తి అన్న చంద్రబాబు ఇప్పుడు సోనియా గొప్ప నాయకురాలు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

అప్పుడు పనికిరాని వ్యక్తి అయిన రాహుల్ ఇప్పుడు విజన్ ఉన్న నాయకుడా అంటూ మండిపడ్డారు. రాష్ట్ర విభజన అన్యాయమని అశాస్త్రీయంగా విభజించారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర ప్రసంగాలు చేస్తున్న చంద్రబాబు రాయచూర్ లో మాత్రం సోనియాగాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అద్భుతంగా విభజించారంటూ వ్యాఖ్యలు చెయ్యడం సిగ్గు చేటన్నారు. 

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చెయ్యడం కాదా అని నిలదీశారు. ఇక్కడ అన్యాయం అక్కడ అద్భుతమా అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

విభజన అనంతరం కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడు నిరసనలు తెలిపిన చంద్రబాబు ఇప్పుడు వాళ్లకు వత్తాసు పలుకుతున్నారంటే రాజకీయాలను ఎలా భ్రష్టుపట్టిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. బాబు నాటకాలను ప్రజలు గమనించాలని కోరారు. 

పారదర్శకత అనేది లేకుండా రహస్యంగా జీవోలు జారీ చేశారంటూ మండిపడ్డారు. ఇంతటి ఘోరమైన పాలన దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా అప్పులు తెచ్చిన ఘనుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు.

 రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఓట్లు అడగలేని చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తారని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు.