ఇంటర్ ఫెయిలైన బాధలో వున్న బాలుడిపై దొంగతనం నేరం అంటగట్టిన వైసిపి యువనేత దారుణంగా కొట్టిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం : ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 9మంది విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారు.ఇలాంటి సమయంలో క్షణికావేశంలో విద్యార్థులు ఏ అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. కానీ విశాఖపట్నంలో ఫెయిల్ అయిన బాధతో వున్న ఓ బాలుడిపై దొంగతనం నేరం అంటగట్టి బట్టలూడదీసి మరీ చితకబాదారు ఓ వైసిపి నేత భార్య, కొడుకు.ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రామకృష్ణనగర్ కు చెందిన నాగ రవికిరణ్(17) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇటీవలే ఇంటర్ ఫస్టి ఇయర్ పరీక్ష రాయగా గత బుధవారం ఫలితాలు వెలువడ్డాయి. సాయంత్రం తన రిజల్ట్ చూసుకోగా ఫెయిల్ అయినట్లు తేలింది. దీంతో అమ్మానాన్న కోప్పడతారని భయపడిపోయిన అతడు ఇంటికి వెళ్లకుండా బయటే వుండిపోయాడు.ఓ ఇంటిముందు తుప్పుబట్టిపోయి వున్న ఓ పాత కారులో కూర్చుని ఏడవసాగాడు. అయితే ఆ కారు వైసిపి ఉత్తరాంధ్ర యువజన సంఘం అధ్యక్షుడు సునీల్ ది.
రాత్రి సమయంలో తమ కారులో గుర్తుతెలియని బాలుడు వుండటాన్ని గమనించిన సునీల్ గుర్తించాడు. దొంగతనానికి వచ్చాడని అనుమానించి రవికిరణ్ ను పట్టుకుని తమ ఇంట్లోకి లాక్కెళ్లాడు. బాలుడు వదిలిపెట్టాలని వేడుకుంటున్నా వినకుండా బట్టలు విప్పించి నగ్నంగా చేసి చితకబాదాడు. సునీల్ తో పాటు తల్లి సింగాలమ్మ, కారు డ్రైవర్ కూడా రవికిరణ్ ను కొట్టారు. అంతటితో వదిలిపెట్టకుండా అర్ధరాత్రి వరకు తమవద్దే నిర్భందించారు.
Read More పరీక్షల్లో ఫెయిల్, మనస్తాపం .. ఏపీలో ముగ్గురు ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య
కొడుకు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిపోతున్న రవికిరణ్ తల్లిదండ్రులకు అర్ధరాత్రి సునీల్ ఫోన్ చేసాడు. మీ కొడుకు మా ఇంటికి దొంగతనానికి వస్తే పట్టుకున్నామని చెప్పాడు. దీంతో వెంటనే సునీల్ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు తీవ్ర గాయాలపాలైన కొడుకును విడిపించుకున్నారు. అక్కడినుండి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కొడుకును చితకబాదిన వారిపై ఫిర్యాదు చేసారు.
అసలే ఇంటర్ ఫెయిలై బాధపడుతున్న తమ కొడుకును దొంగతనం చేసాడంటూ చితబాదడం దారుణమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను కొట్టినవారిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు.
