విజయవాడ : రాబోయే రోజుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రజలే తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. 

ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో మాట్లాడిన బొత్స టీడీపీని జనం పరిగెత్తించేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. టీడీపీ శకం ముగిసిపోయిందన్న బొత్స వచ్చేది రాజన్న రాజ్యమేనని జోస్యం చెప్పారు. 

కొద్దిరోజుల్లో వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో మంచి సంక్షేమ ప్రభుత్వం రాబోతుందని స్పష్టం చేశారు. ఏపీపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఇకనైనా కుట్రలకు స్వస్తి పలకకపోతే ప్రజలే తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. 

చంద్రబాబుకు ఇంకా అధికారం మీద, సీఎం కుర్చీ మీద యావ తగ్గలేదన్నారు. ఆయన ఇంకా తాను సీఎం అనే భ్రమలో బతికేస్తున్నారని విమర్శించారు. ఇదే ధోరణి ఫలితాల తర్వాత కూడా ఉంటే ప్రమాదకరమన్నారు. చంద్రబాబుకు ఎన్నికల సంఘంపై ఏమాత్రం గౌరవం లేదన్నారు. 

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటే అధికారులతో ఎలా సమీక్షలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడే సమీక్షలు చెయ్యడం లేదని అవినీతి, పాతబకాయిలను చక్కబెట్టేందుకే రివ్యూలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మానసిక పరిస్థితిపై అనుమానాలు వస్తున్నాయన్నారు. 

రాజ్యాంగానికి లోబడే అంతా ఉండాలని అందుకు ఎవరూ అతీతులు కారన్నారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అంటే అంత తమాషాగా ఉందా? న్యాయం, ధర్మానిదే అంతిమ విజయమన్నారు. 

ఎన్నికలనోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత 18 కాన్ఫిడెన్షియల్‌ జీవోలను చంద్రబాబు జారీ చేశారని వాటిని త్వరలోనే బయటపెడతామన్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు ముందుంటారని విమర్శించారు. 

రాష్ట్రంలో పోలీస్‌, ఇంటెలిజెన్స్‌ శాఖలను భ్రష్టుపట్టించారంటూ మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ శాఖ ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్‌లను ట్యాప్‌ చేస్తోందని ఏడాదిగా తన ఫోన్ ట్యాపింగ్ లో ఉందన్నారు.  ఎన్నికల సంఘం కూడా తన మాట వినాలని చంద్రబాబు అనుకోవటం అవివేకమన్న బొత్స సీఎస్ పై చంద‍్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. 

అటు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు 2014 ఎన్నికలలో గెలవలేదా అని నిలదీశారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే కరెక్టు ఇప్పుడు తప్పా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలు తన చెప్పుచేతల్లో ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబును చూస్తుంటే జాలేస్తోందన్నారు బొత్స సత్యనారాయణ.