విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ పై దాడికేసును హైకోర్టు, కేంద్రప్రభుత్వం ఎన్ఐఏకు ఆదేశించడంతో చంద్రబాబులో భయం పట్టుకుందని ఆరోపించారు. 

ఎన్ఐఏ అయితే చంద్రబాబు కుట్రను బయటపెడుతుందన్న ఆందోళనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. అందుకే ఎన్ఐఏకి చంద్రబాబు లేఖ రాశారని విమర్శించారు. ఎన్ఐఏకి రాసిన లేఖను చూస్తుంటే చంద్రబాబుకి పట్టుకున్న భయం ఇట్టే అర్థమవుతుందన్నారు. చంద్రబాబు ఈ మధ్య వింత వింతగా ఉందన్నారు. 

పార్టీ నేతలపై హత్యాయత్నం జరిగినా కేంద్రం జోక్యం చేసుకోవద్దనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ విచారణ చెయ్యాలని న్యాయ స్థానం కూడా స్పష్టం చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ పోలీసులు ఇచ్చిన నివేదికలో జగన్ పై హత్యాయత్నం జరిగిందని పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. 

జగన్ పై దాడి కేసును ఎన్ఏఏకి అప్పగిస్తే చంద్రబాబుకు ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలపై చంద్రబాబు ఆధారపడి బతుకుతున్నారనిపిస్తోందని మండిపడ్డారు. 

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా విరుచుకుపడ్డారు బొత్స. పవన్ ఉబలాటం చూస్తుంటో ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకోవాలన్న తపన కనబడుతోందని విమర్శించారు. ఇతర పార్టీలతో పొత్తుకు వెంపర్లాడే ముందు తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయో లేవో పవన్ స్పష్టం చెయ్యాలని బొత్స సూచించారు.