విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి నిప్పులు చెరిగారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బతికిబట్టకట్టగలిగే పరిస్థితి లేదన్నారు. 

అందుకు నిదర్శనమే ఎంపీ సుజనాచౌదరి నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాలే అందుకు నిదర్శనమన్నారు విజయసాయిరెడ్డి. ఈ పరిణామాలను చూస్తుంటే తెలుగుదేశం పరిస్థితి ఏంటో తెలిసిపోతుందన్నారు విజయసాయిరెడ్డి. 

చంద్రబాబు నాయుడుకు ఇద్దరు కొడుకులు ఉన్నారని వారిలో సొంతకొడుకు నారా లోకేష్ అయితే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ విమర్శించారు. సొంతకొడుకు నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోతే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రెండుచోట్ల ఓడిపోయారని చెప్పుకొచ్చారు. 

ఈ రెండుచోట్ల కూడా చాలా కుట్ర రాజకీయం నడిచిందని వివరించారు నారా లోకేష్. ఎన్ని  కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా రెండు చోట్లా పవన్ కళ్యాణ్ గానీ, నారా లోకేష్ గానీ ఇద్దరూ గెలవలేదని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే చంద్రబాబు నాయుడు నమ్ముకున్న ఎల్లోమీడియా కూడా హ్యాండ్ ఇచ్చేసిందన్నారు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే మీపని మీదే మా పనిమాదే అన్నట్లుగా ఎల్లోమీడియా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. 

గత ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి వదిలిన రామబాణానికి చంద్రబాబు నాయుడు నేలకొరిగాడని అన్నారు. ఐదు నెలల క్రితమే కుప్పకూలిపోయారని చెప్పుకొచ్చారు. అయితే ఆ రావణకాష్టం మాత్రం మండుతూనే ఉందన్నారు. 

చంద్రబాబు నాయుడు రావణాసురుడులాగానే అప్పుడప్పుడు లేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది ముగిసిన చరిత్ర అని భవిష్యత్ లేని పార్టీ అంటూ విమర్శించారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరిదీ కాబట్టే అందరికీ మంచి జరుగుతుందని, మనదే భవిష్యత్ అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల పన్నాగాలను నమ్మవద్దని, వారి కుట్రలకు బలవ్వొద్దని సూచించారు. రాష్ట్ర భవిష్యత్ కోరుకునే వారంతా పార్టీలోకి ఆహ్వానిద్దామన్నారు. 

నమ్మకవంతమైన నాయకత్వాన్ని, నమ్మకమైన పాలనను ప్రజలకు అందిద్దామని చెప్పుకొచ్చారు. రాష్ట్రఅభివృద్ధికి ప్రతీ వైసీపీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. జగన్ నాయకత్వంలో అవినీతిరహిత పాలన అందిద్దామన్నారు. 

విశాఖపట్నంలో భూదందాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇటీవలే ఈ భూదందాలపై సిట్ వేశామని నివేదిక అందిన తర్వాత వారికి శిక్షలు పడతాయన్నారు. భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు.