వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున హఠాత్తుగా మృతిచెందిన విషయం తెలిసిందే. నిన్నటివరకు ఎంతో ఆరోగ్యంగా వున్న ఆయన ఇవాళ మృతదేహంగా కనిపించడం పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పులివెందుల ఏరియా ఆస్పత్రి వద్ద వైఎస్సార్‌సిపి మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...పెదనాన్నది సాధారణ మరణం కాదన్నారు. ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. 

ఇంట్లో ఒంటరిగా వున్న ఆయన రాత్రికి రాత్రే మృతిచెందడం..ఒంటిపై గాయాలు, ఇంట్లో రక్తపై మరకలుండటం తమ అనుమానాలకు తావిస్తున్నాయని అవినాశ్ పేర్కొన్నారు. అంగరక్షకులు లేకుండా వున్న ఆయనపై దాడి చేసి హత్య చేసి వుంటారని... ఎన్నికల సమయంలో ఇంత దారుణానికి పాల్పడింది ఎవరో పోలీసులు నిగ్గుతేల్చాలని అవినాశ్ డిమాండ్ చేశారు. 

పెదనాన్న మృతితో మా కటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. గురువారం కూడా ఆయన మైదుకూరు ప్రాంతంలో వైఎస్సార్‌సిపి పార్టీ తరపున ప్రచారం నిర్వహించారని...అలాంటిది తెల్లవారేసరికి మృతి చెందడం సాధారణం కాదన్నారు. ఆయన మృతి అసాధారణంగానే జరిగిందని...హత్య ఎలా జరిగింది, ఎవరి హస్తం వుందో తేల్చాలని అవినాశ్ రెడ్డి కోరారు.   

ఇప్పటికే బాబాయ్ మరణవార్త తెలిసి జగన్మోహన్ రెడ్డి పులివెందులకు బయలుదేరారు. అలాగే వివేకానంద రెడ్డి కుటుంబం, విజయమ్మ, శర్మిల తదితరులు కూడా హైదరాబాద్ నుండి బయలుదేరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పులివెందుల ఏరియా ఆస్పత్రి వద్దకు వైఎస్సార్‌సిపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అవినాశ్ రెడ్డితో పాటు పలువురు వైసిపి నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు.