అమరావతి: ఏపీలో ఎలక్షన్స్ అయిపోయాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ నానా పాట్లు పడ్డ అభ్యర్థులు కాస్తరిలాక్స్ మూడ్ లోకి వచ్చేశారు. సీటు వస్తుందా లేదా అని కొంచెం టెన్షన్, సీటు వచ్చిన తర్వాత గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థుల ఎత్తులను చిత్తులు చేసేందుకు వేసే వ్యూహాలతో ఆయా పార్టీల అభ్యర్థులు నానా హైరానా పడ్డారు. 

ఎలక్షన్స్ మాట దేవుడెరుగు కానీ పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి అని అనని అభ్యర్థులు లేరంటే నమ్మండి. ఇలా వరుస టెన్షన్లతో సతమతమైన అభ్యర్థులు తీరా ఎన్నికలు పూర్తయ్యాక కాస్త రిలాక్స్ మూడ్ లోకి వచ్చేశారు. 

ఫ్యామిలీకి టైమివ్వని కొంతమంది నేతలైతే కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిపోతే మరికొంతమంది గ్రామాల్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడుకొండల అప్పలనాయుడు కూడా ఈ కోవలోకే వచ్చేశారు. 

ఎన్నికల్లో నానా తంటాలు పడ్డ ఆయన ఎన్నికలు అయిన తర్వాత కాస్త రిలాక్స్ మూడ్ లోకి వచ్చేశారు. గ్రామస్థులతో కలిసి ఎంజాయ్ చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని ఓ గ్రామంలో జరిగిన గ్రామదేవత వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు బడుకొండల. 

అయితే అక్కడ ఏర్పాటు చేసిన బుర్రకథను చూసిన ఆయన వారితో కలిసి తన గొంతు కలిపారు. ఎంతో అద్భుతంగా పద్యాలు పాడుతూ అందరి చేత ఔరా అనిపించారు. గతంలో తాను బుర్రకథలు వేసేవాడినని తాను అలవోకగా నాటకాలు వేస్తానంటూ చెప్పుకొచ్చారు. 

గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా అప్పుడప్పుడు సరదాగా పాడుతూ ఎంజాయ్ చేసేవారు బడుకొండల. మెుత్తానికి బడుకొండల అప్పలనాయుడు మాత్రం ఎన్నికలు ముగిసిన తర్వాత రిజల్ట్స్ సంగతి పక్కనపెట్టి గ్రామస్థులతో కార్యకర్తలతో కలిసి సరదాగా రిలాక్స్ అయ్యారు. 

మాజీ ఎమ్మెల్యే అద్భుతంగా పద్యాలు పాడుతూ, డోలక్ వాయిస్తు ఉంటూ కొందరు డబ్బులు విసిరారు. బడుకొండల అప్పలనాయుడు పద్యాలకు మైమరచిపోయారు ప్రజలు. సో మెుత్తానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండల అప్పలనాయుడు ఎన్నికల అనంతరం ఫుల్ గా రిలాక్స్ అవుతున్నారన్నమాట. ఇంకో విషయమేంటంటే బడుకొండ అప్పలనాయుడు మాజీమంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు దగ్గర బంధువు కూడా.