ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం ఢిల్లీ పర్యటనకు వచ్చిన జగన్ తొలుత ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో సమావేశమయ్యారు.

అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్‌కు వచ్చారు. అక్కడ వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, అధికారులు, ఢిల్లీలోని తెలుగువారు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు జగన్‌కు ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఏపీ భవన్ అధికారులు ఆయనకు పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అలాగే స్థానికంగా తనను కలవడానికి వచ్చిన వారితోనూ జగన్ మాట్లాడారు. మధ్యాహ్నం ఏపీ భవన్‌లోనే భోజనం చేసి సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళతారు.