అమరావతి: మరికొద్దిగంటల్లో ఎన్నికల ఫలితాలు జరగనున్నాయి. నరాలు తెగే ఉత్కంఠతో అభ్యర్థులతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

అంతా కౌంటిగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, ఏజెంట్లకు పలు సూచనలు, సలహాలతో అభ్యర్థులు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో వార్తల్లోకెక్కిన గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మరోసారి సిఈవోను కలిశారు. 

గన్నవరం నియోజకవర్గం గన్నవరంలో కౌంటింగ్ కేంద్రం వద్ద అదనపు పరిశీలకులని ఏర్పాటు చేయాలని ద్వివేదికి యార్లగడ్డ వెంకట్రావ్ విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ లో ప్రత్యర్థులు ఆటంకాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని వెంకట్రావు అనుమానం వ్యక్తం చేశారు. 

ఇకపోతే గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్, వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇద్దరి మధ్య ఎన్నికల అనంతరం తీవ్ర విభేదాలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. యార్లగడ్డ వెంకట్రావ్ గెలుస్తున్నాడని ఆయనకు సన్మానం చేస్తానంటూ వంశీ హల్ చల్ చేశారు. 

ఏకంగా ఇంటికి సైతం వెళ్లారు. సన్మానాల వ్యవహారం అయిపోయిన తర్వాత లేఖల యుద్ధం కూడా జరిగింది ఇద్దరి మధ్య. దీంతో ఈ నియోజకవర్గం ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.