విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటినీ కేంద్రం అమలు చేసి తీరాలని డిమాండ్ చేసారు.

ప్రత్యేకహోదా సాధన కోసం అధినేత ఆదేశిస్తే రాజీనామాలకు తాము సిద్ధంగా ఉన్నట్లు వైఎస్ఆర్సిపి ఎంపిలు స్పష్టం చేసారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఎంపిలతో కలిసి నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం పోరాడుతామన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే ఇక్కడ అనేక పరిశ్రమలు ఏర్పాటవుతాయని చెప్పారు. దాని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని తమ పార్టీ నమ్ముతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు విస్తృతంగా రావటంతో ఎక్కువ మంది ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలు పెరిగినట్లు ఎంపి పేర్కొన్నారు. ఒకవేళ పరిశ్రమలు ఇక్కడకే వస్తే ఉద్యోగాల కోసం బయట ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరాలు ఎంతమాత్రం ఉండదన్నారు. అందుకోసమే తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు, నిరాహారదీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు. హోదా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటంలో భాగంగా తామంతా రాజీనామాలకు సైతం సిద్ధమన్నారు.

 విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటినీ కేంద్రం అమలు చేసి తీరాలని డిమాండ్ చేసారు. భాజపా, టిడిపిల దృష్టిలో ప్రత్యేకహోదా అంశం ముగిసిన అధ్యాయమైనా, తమ పార్టీ దృష్టిలో మాత్రం పోరాడి సాధించుకోవాల్సిన అంశమేనన్నారు. ప్యాకేజి వస్తే తమ జేబులు నింపుకోవచ్చని ఆశపడుతున్న వాళ్ళు మాత్రమే ప్యాకేజిని స్వాగతిస్తున్నట్లు ఆరోపించారు. అదే విధంగా పిరాయింపుల నిరోధ చట్టం సవరణ కోసం తాము ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టామని, చర్చకు వచ్చినపుడు దానిపై గట్టిగా మాట్లాడుతామని తెలిపారు.