హైదరాబాద్: ఇటీవలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రశాంత్ కిశోర్ జట్టుకు కోట్ల రూపాయలు చెల్లించింది. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్)కి రూ.37.5 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తెలిపింది. 

ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐ పాక్ ఎన్నికల్లో వైసిపీ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. వైసిపి అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేనాటికి తమ వద్ద కేవలం రూ.74 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత విరాళాల రూపంలో తనకు రూ.221 కోట్లు వచ్చాయని వ్యయంపై సమర్పించిన నివేదికలో వైసీపి తెలిపింది.

ఎన్నికల్లో తాము రూ.85 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. అందులో 9.7 కోట్లు స్టార్ కాంపైనర్లు వ్యయం చేసినట్లు తెలిపిది. వివిధ మీడియా సంస్థలకు రూ.36 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పింది. ఇందులో అత్యధిక భాగం రూ.24 కో్టలు జగన్ సొంత కంపెనీ జగతికి వెళ్లింది. ఆ తర్వాత తమ వద్ద రూ.138 కోట్లు ఉన్నట్లు వైసిపి తెలిపింది. స్క్రాప్ ను విక్రయించడం ద్వారా రూ. 33 వేల రూపాయలు పొందినట్లు చెప్పింది. 

తెలుగుదేశం నివేదిక ఇదీ...

ఎన్నికల తేదీలు ప్రకటించేనాటికి తమ వద్ద రూ.102 కోట్లు ఉన్నాయని, ఎన్నికల తేదీలు ప్రకటించి ఎన్నికలు జరిగేనాటికి విరాళాల రూపంలో రూ.131 కోట్లు వచ్చాయని తెలుగుదేశం పార్టీ తెలిపింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కోసం హెలికాప్టర్లు అద్దెకు తీసుకున్నామని, దీనికి రూ.9 కోట్లు చెల్లించామని టీడీపీ తెలిపింది. 

ఎన్నికల్లో రూ.77 కోట్లు ఖర్చు చేశామని, ఇందులో రూ.49 కోట్లు మీడియా పబ్లిసిటీ కోసం ఖర్చు చేశామని టీడీపి చెప్పింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రూ.29 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. రూ.188 కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపింది. మజ్లీస్ రూ.71,961 ఖర్చు చేసినట్లు తెలిపింది.