వైఎస్సార్ జిల్లా వైసిపి అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసిపి సీనియర్ నాయకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కడప మేయర్ సురేష్ బాబు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్ కు తరించారు.

కడప : వైఎస్సార్ కడప జిల్లా వైసిపి అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గత శుక్రవారం నుండే ఇబ్బందిపడుతున్న మేయర్ శనివారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కడపలోకి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం సురేష్ బాబు కు మెదడులో స్వల్పంగా రక్తస్రావం అయినట్లు... మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతానికి సురేష్ బాబుకు ప్రమాదమేమీ లేదని డాక్టర్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇలా అస్వస్థతకు గురయ్యాడు. మేయర్ సురేష్ బాబు ఆరోగ్యపరిస్థితి గురించి ముఖ్యమంత్రి జగన్ పార్టీ నాయకులతో ఆరా తీసినట్లు సమాచారం. ఇక ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఇతర వైసిపి నాయకులు కొందరు సురేష్ బాబును పరామర్శించి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.
హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కడప మేయర్ చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతుండగా వారికి వైసిపి పెద్దలు ఫోన్లు చేసి ధైర్యం చెబుతున్నారు. సురేష్ బాబు క్షేమంగా వుండాలని ఆయన అనుచరులు, కడప వైసిపి నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.