అనంతపురం: అనంతపురం జిల్లాలో మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు జిల్లా ఇంచార్జ్ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం కదిరి నియోజకవర్గం అభ్యర్థిగా డా. పీవీ సిద్ధారెడ్డిని నియమించిన మిథున్ రెడ్డి మంగళవారం మరో అభ్యర్థిని ప్రకటించారు. 

శింగనమల నియోజకవర్గం అభ్యర్థిగా ఆ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో పరాజయం పాలైన పద్మావతి ఈఎన్నికల్లో గెలిచే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. 

ఇక నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పి.యామినీ బాల తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి ప్రాతినిథ్యవం వహిస్తున్నారు. ఈమె మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ పి.శమంతకమణి కుమార్తె. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా కూడా కొనసాగుతున్నారు. 

రాజకీయాల్లోకి రాకముందు యామినీ బాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే 2014 ఎన్నికల్లో అనూహ్యంగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించి బరిలోకి దిగిన తొలిసారే విజయం అందుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గం మరియు మహిళా కోటాలో యామినీబాలకు చంద్రబాబు కేబినేట్ లో బెర్త్ వస్తుందని ఆశించారు. 

అయితే చంద్రబాబు నాయుడు కేవలం ప్రభుత్వ విప్ పదవితో సరిపెట్టేశారు. ఇకపోతే ఈ నియోజకవర్గం నుంచి 2004,2009 ఎన్నికల్లో మాజీమంత్రి శైలజానాథ్ విజయం సాధించారు. రెండు సార్లు శైలజానాథ్ చేతిలో శమంతకమణి ఓటమి పాలవ్వడంతో అనూహ్యంగా ఆమె తనయ యామినీబాలను తెరపైకి తీసుకువచ్చారు. టిక్కెట్ సాధించుకుని గెలిపించుకోగలిగారు.  
ఇక ఈ నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. యామినీబాలకు ఇంటిపోరు పెద్ద సమస్యగా మారింది. తల్లీ కూతుళ్ల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువ కావడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది పార్టీ పరిస్థితి. నియోజకవర్గంలో ఎవరికి వారు వేరు వేరు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంటిపోరును కాస్త బజారుపాల్జేస్తున్నారు.  

దీంతో శింగ‌న‌మ‌ల‌ నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. అటు క్యాడర్ అంతా శమంతకమణివైపే వెళ్లిపోయిందని ప్రచారం. ఇకపోతే నియోజకవర్గ అభివృద్ధిపై యామినీ బాల అంతగా దృష్టిసారించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

నియోకవర్గంలో తాగునీటి సమస్యను పూర్తి చేస్తామని హామీ ఇచ్చి అసలు ముఖం చూపించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారలు విషయంలో కూడా ఎలాంటి శ్రద్ధ పెట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

యామినీబాల హయాంలో శింగ‌మ‌న‌ల అభివృద్ధిలో ద‌శాబ్దాలు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని ప్రచారం. అయితే తాను అభివృద్ది చేస్తున్నా స్థానికంగా ఉన్న కొంతమంది నేతలు త‌న‌పై క‌క్ష క‌ట్టి ఇలా ప్ర‌చారం చేయిస్తున్నార‌ని మండిపడుతున్నారు. త‌న ఎదుగుద‌లను పలువురు టీడీపీ నేత‌లు జీర్ణించుకోలేక పోతున్నార‌ని ఆమె ఆరోపిస్తున్నారు. 

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన సర్వేలో యామినీ బాలకు వ్యతిరేకంగా నివేదిక వచ్చింది. దీంతో చంద్రబాబు ఆమెపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.  నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ప్రజల మధ్య తిరగడం లేదని పేరుకే ఎమ్మెల్యే అంటూ చంద్రబాబుకు పలువురు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 

తల్లీకూతుళ్ల మధ్య ఆధిపత్య పోరులో తెలుగుదేశం పార్టీ రోడ్డున పడటంతో చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నారట. రాబోయే ఎన్నికల్లో యామినీబాలకు హ్యాండ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టిక్కెట్ తనకు లేదా తన కుమారుడు అశోక్ కు దక్కించుకునే ప్రయత్నాల్లో బిజీబిజీగా ఉన్నారు ఎమ్మెల్సీ శమంతకమణి. 
 
ఎమ్మెల్యే యామినీ బాల, ఆమె తల్లి శమంతకమణిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం, వారి మధ్య ఆధిపత్య పోరు అధినేత దృష్టికి వెళ్లడంతో వారిపై గుర్రుగా ఉన్నారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో మాజీమంత్రి శమంతకమణి మాట కాదనలేక ఆమె కూతురుకి క్కెట్ ఇచ్చారు. ఈసారి ఆ కటుంబానికి టిక్కెట్ ఇచ్చే ఛాన్సే లేదని ప్రచారం జరుగుతుంది. 

ఈ నేపథ్యంలో 2014లో చివరి వరకు టిక్కెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ బండారి రవికుమార్ కుటుంబం ఈసారైనా బరిలోకి నిలవాలని ప్రయత్నిస్తోంది. తమ కుటుంబానికి చెందిన శ్రాణికి టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 

మరోవైపు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చెయ్యాలని భావించిన మాజీమంత్రి సాకే శైలజానాథ్ సైతం పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు ఉంటే టిక్కెట్ దక్కించుకోవచ్చని ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ పొత్తులేకపోతే టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని భావిస్తున్నారట. 
 
ఇదిలా ఉంటే వైసీపీ అభ్యర్థి జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి నియోజకవర్గంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కేవలం నాలుగువేల ఓట్లతో ఆమె పరాజయం పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఆమె దూసుకుపోతున్నారు. విద్యావంతురాలుగా, సేవాగుణాలు కలిగిన వ్యక్తిగా పద్మావతికి మంచి పేరుంది.  

అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబకలహాలు, తల్లికూతుళ్ల ఆధిపత్య పోరు, టిక్కెట్ పై ఆశావాహులు ఎక్కువగా ఉండటం ఇవన్నీ తనకు కలిసొస్తాయని పద్మావతి భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీవైపు మల్లింది. 

అయితే ఈసారి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఆమె తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ తలపెట్టిన గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, రావాలి జగన్, కావాలి జగన్, వంటి కార్యక్రమాలతో ఆమె దూసుకుపోతున్నారు. 

అలాగే వైఎస్ జగన్  ప్రకటించిన నవరత్నాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలతో కలిసిపోయి నిత్యం ప్రజల మధ్యే తిరుగుతున్నారు. ఈసారి తనదే గెలుపంటూ ఆమె గట్టి నమ్మకంతో ఉన్నారు.