హైదరాబాద్‌ : వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బీసీ గర్జన సభ సాక్షిగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని బీసీ అభ్యర్థికే కేటాయించారు. 

ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థిగా ఆ పార్టీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్‌ జంగా కృష్ణామూర్తిని ప్రకటించింది. అందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జంగా కృష్ణమూర్తికి బీ ఫారం అందజేశారు. 

ఈ నెల 25న జంగా కృష్ణమూర్తి అమరావతిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు శాసనమండలి ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 28 కాగా  మార్చి 1న నామినేషన్ల పరిశీలన, మార్చి 5న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొంది. 

మార్చి 12న పోలింగ్ జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మరియు విజేతను కూడా ప్రకటించనున్నారు. మార్చి15న ఎన్నికల ప్రక్రియ తంతు ముగియనుంది.