హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై బిజెపి తెలంగాణ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారు రఘునందన్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ డిజిటల్ మీడియా ఇంచార్జీ దేవేందర్ రెడ్డి గుర్రంపాటి  ఆ మేరకు ప్రకటన విడుదల చేశారు. 

"అయ్యా ర‌ఘునంద‌న‌రావా.. త‌మ‌రెంత‌.. త‌మ‌రి బ‌తుకెంత‌..? మీరు వైఎస్ఆర్ గారి మ‌ర‌ణం గురించి మాట్లాడేంత వారా? మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి గారు పొందిన త‌ర‌హా మ‌ర‌ణాన్ని పొందాలంటే పాల‌కుడిగా పెట్టి పుట్టాలి! త‌న తుదిశ్వాస ను కూడా ప్ర‌జ‌ల కోసం పోతూనే విడిచిన చ‌రిత్ర వారిది! అప్పుడు మీలాంటి బొకాడియాలు ఎక్క‌డున్నారో ఎవ‌రికీ తెలియ‌దు" అని ఆయన అన్నారు.

"మీరేంటి, చిత్తు కాగితంతో స‌మాన‌మైన మీ చ‌రిత్ర‌ ఏమిటో మాకు అన‌వ‌స‌రం. మీరు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయం చేయాలనుకుంటే.. మీ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను విమ‌ర్శించుకోండి. మీరూ మీరూ తూర్పార‌బ‌ట్టుకోండి. మా పార్టీ గ్రేట‌ర్ బ‌రిలో లేక‌పోయినా మీ లాంటి వాళ్ల‌కు మా నేత‌లు నిద్ర లేకుండా చేస్తున్న‌ట్టున్నారే! మీ రాజ‌కీయం కోసం మీరు గుడికే వెళ్తారో, గుండు కొట్టించుకుంటారో మాకు అన‌వ‌స‌రం" అని ఆయన అన్నారు.

"ఒక‌టి గుర్తుంచుకోండి... ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖర రెడ్డి గురించి కానీ, వైఎస్ కుటుంబం గురించి కానీ మాట్లాడే అర్హ‌త మీకు లేదు. వారి కాలిగోటికి స‌రిపోదు మీ జీవితం. కొత్త బిచ్చ‌గాడు పొద్దెర‌గ‌న‌ట్టుగా మీరు ఇష్టానుసారం మాట్లాడ‌వ‌ద్దు, మ‌రోసారి ఈ త‌ర‌హాలో మాట్లాడితే.. అందుకు ప‌ర్య‌వ‌స‌నాల‌ను ఎదుర్కొనాల్సి ఉంటుందని బ‌హిరంగంగా చెబుతున్నాం. ఒళ్లు జాగ్ర‌త్త‌గా పెట్టుకుని మాట్లాడు ర‌ఘునంద‌న‌రావ్!" అని దేవేందర్ రెడ్డి గుర్రంపాటి అన్నారు.

వైఎస్సార్సీపీ రాష్ట్ర చీఫ్ డిజిటల్ మీడియా డైరెక్టర్ కె. భాస్కర్ రెడ్డి ట్విట్టర్ వేదిక స్పందించారు. రఘునందన్ రావు వ్యాఖ్యల తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్టిట్టర్ తన వ్యాఖ్యలకు రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జత చేశారు.