కడప: బిజెపికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య దూరం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి బిజెపి దగ్గరవుతున్నట్లు కూడా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలను బట్టి ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. 

రాష్ట్రంలో బిజెపి నాయకత్వం చంద్రబాబు సృష్టించిన ట్రాప్ లో పడినట్లు కనిపిస్తోంది సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. కడపలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. టీడీపి ఎంపిలను బిజెపిలోకి పంపించిందే చంద్రబాబు అని ఆయన అన్నారు. తద్వారా జైళ్లకు వెళ్లకుండా పరస్పరం కాపాడుకునే ప్రయత్నం చేశారని అన్నారు. 

టీడీపి నేతలకు బిజెపి షెల్టర్ జోన్ లా తయారైందని సి. రామచంద్రయ్య అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 370 రద్దుకు తాము మద్దతు ఇచ్చామని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బిజెపి తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోలేదని, చంద్రబాబు దోపిడీ మాత్రమే ఆగిపోయిందని ఆయన అన్నారు. 

బిజెపి నిర్మాణాత్మకంగా వ్యవహరించి రాష్ట్రాభివృద్ధికి తగిన సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఏది మాట్లాడితే అదే ప్రజలు నమ్ముతారని అనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 75 రోజులు మాత్రమే అయిందని, ఈ దశలోనే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబు పాలన తమకు వారసత్వంగా వచ్చిందని, దివాళా తీసిన ప్రభుత్వాన్ని తాము చేపట్టామని ఆయన అన్నారు.