ఆత్మకూరు: సీఏఎ, ఎన్ఆర్సీలకు పార్టీ మద్దతు ఇవ్వడంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చక్రపాణిరెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు తమ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

దేశంలోని ముస్లింలపై వివక్ష ప్రదర్శించే విధంగా పార్లమెంటులో బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్ఆర్సీలు ఉన్నాయని ఆయన అన్నారు. ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో వైసీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

సీఏఏ, ఎన్ఆర్సీలకు తమ పార్టీ పార్లమెంటు సభ్యులు మద్దతు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. చట్టం అమలులో భాగంగా ముస్లింలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. 

ఆవసరమైతే రాజీనామా చేసేందుకైనా వెనుకాడబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లామని, ఆ చట్టాలతో ఎవరికీ ఏ విధమైన నష్టం జరగదని జగన్ చెప్పారని ఆయన వివరించారు.