వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్: పులివెందుల నుండి హైద్రాబాద్ కు తరలింపు
వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. పులివెందుల నుండి వైఎస్ భాస్కర్ రెడ్డిని హైద్రాబాద్ కు తరలిస్తున్నారు.
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని పులివెందుల నుండి హైద్రాబాద్ కు తరలిస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆదివారంనాడు ఉదయం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.
also read:వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం... వైఎస్ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్
రెండు రోజుల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన రెండు రోజులకే వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజ న ఈ కేసులో అరెస్టైన నిందితులు సునీల్ యాదవ్, దస్గగిరి తదితరులు వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలోనే ఉన్నారని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. గూగుల్ టేకవుట్ ద్వారా ఈ మేరకు ఆధారాలను సేకరించినట్టుగా సీబీఐ అధికారులు చెబుతున్నారు.
హైద్రాబాద్ లో సీబీఐ మేజిస్ట్రేట్ ముందు వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ సాయంత్రం హాజరుపర్చే అవకాశం ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ 2019 మార్చి 14వ తేదీన వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నట్టుగా సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నుండి గొడ్డలిని దస్తగిరి తీసుకు వచ్చే వరకు సునీల్ యాదవ్ భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని గూగుల్ టేకవుట్ ద్వారా ఆధారాలు సేకరించినట్టుగా సీబీఐ అధికారులు పేర్కొంటున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండు రోజుల క్రితం అరెస్టైన ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు కీలక సమాచారం పొందుపర్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను ఉదయ్ కుమార్ రెడ్డి చెరిపివేశారని పేర్కొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి మృతదేహనికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజీ కట్టారు. అంతేకాదు అంబులెన్స్ , ఫ్రీజర్ తెప్పించడంలో ఉదయ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరించాని సీబీఐ పేర్కొంది. 2019 మార్చి 14వ తేదీ రాత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు హత్య చేశారు.ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తుంది.