మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై పోలీసుల రూపొందించిన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేక మృతదేహంపై ఏడు చోట్ల పదునైనా, లోతైన గాయాలున్నాయి.

తలకు తగిలిన గాయాలు కనిపించకుండా బ్యాండేజి వేసినట్లు పోలీసులు తెలిపారు. తొలుత వివేకాను అత్యంత క్రూరంగా హింసించి.. ఆ తర్వాత పదునైనా ఆయుధంతో తలపై దాడి చేసినట్లు తేలింది.

గంగిరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, ఎద్దుల ప్రకాశ్‌ల అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ ఈ విషయాలను తేటతెల్లం చేసింది. సాక్ష్యాధారాలకు సంబంధించిన ఆనవాళ్లను తుడిచివేసినందుకు గాను వీరిపై ఐపీసీ సెక్షన్ 201 కింద త్వరలో పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు.

వివేకా హత్య జరిగిన రోజు ఉదయం 5.30 గంటలకు ఆయన పీఏ వెంకట కృష్ణారెడ్డ్డి.. బయట కూర్చొని పేపర్లు చదువుకున్నారు. ఆ తర్వాత వివేకా భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేసి సార్ ఇంకా నిద్ర లేవని చెప్పడంతో ... ఆమె అప్పుడే లేపొద్దని కృష్ణారెడ్డికి సూచించారు.

మరో అరగంట తర్వాత పని మనిషి, ఆమె కుమారుడు ప్రకాశ్ అక్కడికి చేరుకుని.. కృష్ణారెడ్డి సూచన మేరకు వివేకాను లేపేందుకు పలుమార్లు పిలిచారు.అయితే ఇంటి వెనుక వైపున్న తలుపు తెరచుకుని ఉండటంతో కృష్ణారెడ్డి, ప్రకాశ్ ఇంట్లోకి వెళ్లారు.

లోపలికి వెళ్లి చూడగా పడకగదిలో రక్తం కనిపించింది. అనంతరం బాత్‌రూమ్‌లో వివేకా రక్తపు మడుగులో పడివున్నారు. వెంటనే విషయాన్ని ఆయన భార్య, అల్లుడు రాజశేఖర్ రెడ్డికి కృష్ణారెడ్డి ఫోన్ చేసి తెలిపారు.

మరోవైపు వివేకా బెడ్‌రూమ్, బాత్‌రూమ్‌లోని రక్తపు మరకలను తుడిచివేసేందుకు వినియోగించిన ప్లాస్టిక్ బకెట్, తడిగుడ్డ, తల వెంట్రుకలు, బొట్టు స్టిక్కర్లతో పాటు కృష్ణారెడ్డి దగ్గర నుంచి వివేకానందరెడ్డికి చెందిన రెండు సెల్‌ఫోన్లు, ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు కేసులో ప్రధాన నిందితుడు ఎవరో తేల్చేందుకు మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు తెలిపారు. సాక్ష్యాధారాలు లేకుండా చేసి హంతకుడు తప్పించుకునేందుకు సహకరించిన వారికి బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అలాగే 15 రోజుల పాటు గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు.